కరోనా మహమ్మారి నుంచి ఊపిరి పీల్చుకున్న ప్రజలను నిత్యావసరాల ధరలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆదాయం అంతంతే ఉండగా.. ఖర్చులు భారీగా పెరుగుతుండటంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో కొందరు ఆహార అలవాట్లు మార్చుకుంటున్నారు. కొండెక్కుతున్న కోడి, యాట మాంసం కొనలేక మాంసాహారం లేని భోజనం, రేట్లు పెరిగిపోయిన పప్పులను తగ్గించుకుని పప్పులేని చారు వైపు మళ్లుతున్నారు. మరికొందరు గ్యాస్ సిలిండర్ స్థానంలో కట్టెలపొయ్యి వైపు కదులుతున్నారు. భగ్గుమంటున్న టమాటా వంటి కూరగాయలు తినడాన్నీ తగ్గించుకుంటున్నారు. పెట్రోల్ ధరలు చుక్కల్లో ఉండటంతో ప్రయాణాలూ సామాన్యులపై మరింత భారాన్ని పెంచుతున్నాయి. షాక్ కొడుతున్న కరెంటు బిల్లులు.. మంట పుట్టిస్తున్న వంటనూనెలు.. ఉప్పులు, పప్పుల ఖర్చులు.. హోటళ్లలో అల్పాహారం, భోజనం.. ఇలా ఒకటేమిటి ప్రతి వస్తువు ధర పెరిగింది. దీంతో ఇంటి ఖర్చులు అమాంతం పెరిగిపోతున్నాయి.
భారీగా పెరిగిన ఖర్చులు
2021 మే నెలలో పెట్రోల్ లీటర్ ధర రూ.97.63. ఇప్పుడు రూ.109.66. లీటర్‌పై రూ.12.03 భారం పెరిగింది. నెలకు 30 లీటర్లు వాడేవారిపై రూ.360 అదనపు భారం. కిలో కోడి మాంసం ఏడాదిలో రూ.80 పెరిగింది. వారానికోసారి చూసినా నెలకు రూ.320 పెరిగింది. గ్యాస్ సిలిండర్ భారం రూ.305 హెచ్చింది. ఇళ్ల అద్దెలు సగటున రూ.రెండు వేలు.. కరెంటు రూ.200-300, ప్రయాణ ఖర్చులు రూ.300-400 చొప్పున అధికమయ్యాయి. దిగువ మధ్యతరగతి ప్రజల ఖర్చులు నెలకు రూ. రెండు వేల నుంచి మూడు వేలు పెరిగాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి పెరిగే స్కూల్, బస్సుల ఫీజుల రూపంలో భారీగా పడే భారాన్ని తలచుకుని మరింత ఆందోళన చెందుతున్నారు. బస్సు, ఆటోల ఛార్జీలు భారీగా పెరిగాయి. రూ.10 ఛార్జీ రూ.15-20 అయ్యింది.
తగ్గుతున్న గ్యాస్ వాడకం
గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరుగుతుండటంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ వాడకం తగ్గుతోంది. నాగుల్ దేవులపల్లిలో మూడు చమురు కంపెనీల పరిధిలో ప్రతినెలా దాదాపు 250 సిలిండర్ల వాడకం ఉండేది. ఇప్పుడు అక్కడ నెలకు దాదాపు 150కి మించి సిలిండర్లను రీఫిల్ చేయించుకోవటం లేదని డీలర్లు చెబుతున్నారు. అందులో ఇండియన్ గ్యాస్ సిలిండర్లు నెలకు 120 మంది రీఫిల్ చేయించుకునేవారు. ఇప్పుడు నెలకు 85 సిలిండర్లే రీఫిల్ అవుతున్నాయని డీలర్ జనార్దన్ తెలిపారు.
గ్యాస్‌కు పూర్తిగా దూరం..
మాది మధ్య తరగతి కుటుంబం. అర ఎకరం పొలం ఉంది. పొలం పనులతో పాటు కూలిపనులూ చేసుకుంటాం.ఆరేళ్ల క్రితం గ్యాస్ కనెక్షన్ తీసుకున్నాం. అప్పటినుంచి సిలిండర్లపై వంటలు చేసుకునేవాళ్లం. ధరలు భారీగా పెరగటంతో సిలిండర్లను కొనలేకపోతున్నాం. పూర్తిగా కట్టెల పొయ్యినే వాడుతున్నాం.
- బంగారోళ్ల శేఖులు, నాగుల్ దేవుల్‌పల్లి
కూరగాయలు తగ్గించాం..
పెరిగిన ధరలు, ఖర్చులతో ఏం తినేట్టు లేదు. కొనేట్టు లేదు. ఏడాది క్రితం- కిలో రూ.160-170 ఉన్న కోడిమాంసం రూ.మూడొందలైంది. ఎండుమిర్చి రూ. 130-140 నుంచి రూ.250 దాటింది. కిలోకు బదులు అరకిలో కారమే కొంటూ పచ్చిమిర్చి కారం కలుపుకొంటున్నాం. నెలకు మూడుసార్లు కాకుండా ఒకసారే కోడిమాంసం తింటున్నాం. రూ.20-30 ఉండే కిలో టమాటా రూ.100 దాటింది. 5 లీటర్ల ఆయిల్ డబ్బా రూ.550 నుంచి రూ.750 దాటింది. కూరగాయలు ఒకపూటే వండుకుని మరోపూట పచ్చిపులుసు, పప్పులేని చారుతో సరిపెట్టుకుంటున్నాం. ఆర్నెల్లలోనే కారంపొడి ధర రూ.160 నుంచి రూ.300 అయ్యింది. బండిలో రూ.100 పెట్రోల్ పోయించుకుంటే మూడురోజులు వచ్చేది. ఇప్పడు రెండ్రోజులకూ చాలట్లేదు.
-బండిరాల బాబు, ఇస్త్రీ దుకాణం, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి జిల్లా
ఊరెళ్లడం, గ్యాస్ వాడకం తగ్గించాం
భార్యాభర్తలిద్దరం సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తాం. ఖర్చులు పోను నెలకు రెండు, మూడువేలు మిగిలేవి. ధరలు పెరగడంతో సొంతూరు వెళ్లడం, షాపింగ్ చేయడం మానేశాం. ఏడాది కిందట రూ.ఏడెనిమిది వందలున్న సిలిండర్ ధర రూ.వెయ్యి దాటింది. వేడినీళ్లు, రొట్టెలకు కట్టెలపొయ్యి వాడుతున్నాం. ఇంటిఅద్దె ఒక్క గదికి రూ.రెండువేల నుంచి రూ.మూడువేలకు పెంచారు. టమాటా, మంచినూనె వాడకం తగ్గించేశాం.
- పూర్ణిమ, మత్తుగూడ, హైదరాబాద్
కట్టెల పొయ్యి.. కిలో నూనెతోనే నెలంతా
ముగ్గురు సభ్యుల్లో ఇద్దరు దివ్యాంగులున్న మా కుటుంబానికి పింఛనుతో పాటు కూలిపనులే జీవనాధారం. పెరిగిన ధరలతో ఆర్నెల్లుగా వంటకు గ్యాస్ వాడకం పూర్తిగా మానేశాం. అడవికి వెళ్లి కట్టెలు తీసుకొచ్చి వంట చేసుకుంటున్నాం. గతంలో నెలకు మూడు కేజీల మంచినూనె వాడేవాళ్లం. ఇప్పుడు కిలోతో సరిపెట్టుకుంటున్నాం. పండగల్లో తప్ప మాంసాహారం ముట్టడం లేదు. పెరిగిన ధరలతో జీవనం గగనంగా మారింది.
- గోవర్ధన్, నాగుల్ దేవుల్‌పల్లి, హత్నూర మండలం, సంగారెడ్డి జిల్లా