కార్మికుల సమ్మె సామాన్యునిపై పెను ప్రభావం చూపిస్తోంది. కార్మికులు తగ్గటం లేదు.. ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపటం లేదు. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు, ఇతర వాహనాలు ప్రధాన మార్గాలకే పరిమితం కావడం వల్ల ఎక్కువగా ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. దీనివల్ల రోజువారీ ప్రయాణ ఖర్చులు రెండింతలవుతున్నాయని సామాన్యులు వాపోతున్నారు.
బస్ పాసుల అనుమతి లేదు
చాలా బస్సుల్లో తాత్కాలిక కండక్టర్లు బస్ పాసులను అనుమతించకుండా డబ్బులు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా అది పూర్తిస్థాయిలో కార్యరూపంలోకి రాలేదు. ఇల్లెందు-ఖమ్మం రహదారిలో నిత్యం పదికిపైగా బస్సులు రహదారిపై కనిపించేవని.. సమ్మె కారణంగా కనీసం రెండు బస్సులు కూడా కనిపించడం లేదని ప్రజలు వాపోతున్నారు.
హైదరాబాద్ నుంచి ఖమ్మం: రూ.850 ఛార్జీ
హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు కొన్ని ప్రైవేటు సర్వీసులు రూ.850 ఛార్జీ వసూలు చేస్తున్నాయని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఎల్బీనగర్ నుంచి మిర్యాలగూడకు రూ.350 ఇస్తేనే బస్సు ఎక్కాలని, లేకుంటే అనుమతించేది లేదని కండక్టర్లు చెబుతుండటం గమనార్హం.
పరిమితికి మించి ప్రయాణికుల రవాణా
హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, కర్నూలు మార్గాల్లో ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. గురువారం విజయవాడ వైపు వెళ్లిన ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం పైగా సర్వీసుల్లో వెయిటింగ్‌లిస్ట్ పరిమితి కూడా దాటిపోయింది.
ఇవీ చూడండి: వెనక్కు తగ్గేది లేదు.. సమ్మె మరింత ఉద్ధృతం