హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలోని ఎమ్మెల్యే కాలనీ వాసులంతా వ్యాక్సిన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారంతా ఓ ప్రైవేట్ ఆస్పత్రి సాయం తీసుకుని.. తమ కాలనీలోని క్లబ్లో టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మూడ్రోజులుగా 769 మంది టీకా తీసుకున్నారు.
నిబంధనలకు అనుగుణంగా..
జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా టీకా వేయిస్తున్నారు. ఇందుకోసం క్లబ్‌లోనే టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే 90 శాతం కాలనీవాసులు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇవే కాకుండా.. జూబ్లీహిల్స్‌లోని గాయత్రీహిల్స్ కాలనీ, ఎంపీ, ఎమ్మెల్యేల కాలనీలు సైతం ముందుకొస్తున్నాయి. కరోనా నిబంధనలకు అనుగుణంగా వ్యాక్సిన్ కేేంద్రాలను తీర్చిదిద్దుతున్నారు. కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సినీ కార్మికులకు...
మరోవైపు సినీనటుడు చిరంజీవి ఆధ్వర్యంలో ఇప్ప టికే జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉన్న 24 విభాగాల సినీ కార్మికుల కోసం సీసీసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా టీకాలు అందిస్తున్నారు.
పోలీసుల ఆధ్వర్యంలో..
ఇక పశ్చిమ మండలంలోని 13 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పేదలకు, నిరాశ్రయులకు, కార్మికులకు టీకాలు వేయించేందుకు పోలీసులు సోమవారం బంజారాహిల్స్‌లోని ముపకంజా కళాశాలలో భారీ శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో దాదాపు 5 వేల మందికి టీకా ఇప్పించేందుకు రంగం సిద్ధం అవుతోంది.
ఇదీ చదవండి : ప్రసాదంలో ఉమ్మిని కలిపి ఇస్తున్న బాబా