దేశంలోని 72%కి పైగా సహకార సంఘాలు ఆదాయపన్ను విభాగానికి దొరకకుండా ఉన్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పేర్కొంది. దేశంలో ప్రస్తుతం ఉన్న సహకార సంఘాల సంఖ్యకు, ఐటీ డేటాబేస్‌లో ఉన్నవాటి సంఖ్యకు అసలు పొంతనే లేదని తేల్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంఘాల్లో 92% వివరాలు ఆ విభాగం వద్ద లేవని పేర్కొంది. 2014-15 నుంచి 2018-19 వరకు దేశవ్యాప్తంగా ఉన్న సహకార సంఘాలు, సహకార బ్యాంకుల పనితీరును పరిశీలించిన అనంతరం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. నిబంధనల ప్రకారం అవి తమ ఆదాయంపై పన్ను చెల్లించాల్సిందేనని కాగ్ అభిప్రాయపడింది.
ఈ సంస్థలు నమోదయ్యే రిజిస్టరింగ్ అథారిటీల నుంచి సహకార సంఘాలు, బ్యాంకుల వివరాలు తీసుకొనే వ్యవస్థ ప్రస్తుతం ఆదాయ పన్ను విభాగం వద్ద లేదని తెలిపింది. సహకార సంఘాలు, బ్యాంకులను అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్‌గా గుర్తించాల్సి ఉండగా, ఇప్పటి వరకు వీటిని సంస్థలు (ఫర్మ్), వ్యక్తులతో కూడిన సంస్థ (బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్), కంపెనీలు, స్థానిక సంస్థలు (లోకల్ అథారిటీలు)గా చూపించి చట్టవిరుద్ధంగా పన్ను మినహాయింపులు పొందినట్లు పేర్కొంది. ఇలా దాదాపు 649 కేసుల్లో రూ.694 కోట్ల మేర పన్ను ప్రభావం పడినట్లు స్పష్టం చేసింది.
భత్యాలు, ఖర్చులు, వెనుకటి నష్టాలు (క్యారీఫార్వర్డ్ లాసెస్), పన్ను విధింపు, దానిపై వడ్డీ లెక్కింపు, టీడీఎస్ కోత, జరిమానాల విధించే విషయంలో చట్టంలో పొందుపరిచిన నిబంధనలను అనుసరించకపోవడంవల్ల 858 కేసుల్లో దాదాపు రూ.12,328 కోట్లమేర పన్ను ప్రభావం కనిపించినట్లు పేర్కొంది. ఇది అసెస్‌మెంట్ విధానంలో ఉన్న బలహీనతలను బయటపెడుతోందని ఆక్షేపించింది. అందువల్ల ఐటీ విభాగంలో అంతర్గత నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నట్లు సూచించింది. కాగ్ నివేదిక ప్రకారం ఐటీ విభాగం పరిధిలో లేని సంస్థలు బిహార్ తర్వాత అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. బిహార్‌లో 97.58% సంస్థలు ఐటీ డేటాబేస్‌కు బయట ఉండగా, తెలుగురాష్ట్రాల్లో అలాంటివి 92.35%మేర ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 2,207 సహకార సంఘాలు ఉండగా అందులో 168 మాత్రమే ఐటీ పరిధిలో ఉన్నాయి. తమిళనాడు, పుదుచ్చేరిలో 91.30%మేర కనిపించాయి.