కరోనా నేపథ్యంలో విద్యావ్యవస్థకు సంబంధించిన అంశాలు, రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసే అంశాలపై.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. యూజీసీ, ఏఐసీటీఈ సూచనల ప్రకారం రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే మిగతా వారిని పైతరగతులకు ప్రమోట్ చేయాలని స్పష్టం చేశారు. ఆగస్టు 17 నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని తెలిపారు. విద్యార్థులు ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం రూపొందిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. పాఠశాలల పునఃప్రారంభం ఎప్పుడు చేయాలి, విద్యాబోధన ఎలా జరగాలన్న విషయాలపై కేంద్రం మార్గదర్శకాలను, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించి ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
అప్పుడే దోపిడీకి అడ్డుకట్ట..
ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతంపైనా సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ విద్యాసంస్థల పనితీరును మెరుగుపరిచి, అత్యుత్తమ విద్యాబోధన జరిగేలా చేయడం ద్వారానే విద్య పేరు మీద జరుగుతున్న దోపిడిని.. అరికట్టడం సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఒక్కో రంగంపై దృష్టి సారించి క్రమంగా ధీర్ఘకాలిక సమస్యల నుంచి... ప్రజలకు శాశ్వత విముక్తి కలిగిస్తూ వస్తున్నాం. విద్యుత్ సమస్య, మంచినీటి గోస, సాగునీటి సమస్యలు పరిష్కారం కావడంతో పాటు వ్యవసాయ రంగం కుదుటపడుతోంది. భూకబ్జాలు, పేకాట క్లబ్బులు, గుడుంబా బట్టీలు.. ఇలా అనేక సమస్యలను పరిష్కరించుకుంటున్నాం. ఇక రెవెన్యూ శాఖ ప్రక్షాళన, విద్యావ్యవస్థ బలోపేతంపై దృష్టి పెడతాం.
-కేసీఆర్
త్వరలో వర్క్‌షాప్..
విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఏంచేయాలనేదానిపై త్వరలోనే ఓ వర్క్‌షాప్ నిర్వహించి, విద్యారంగ నిపుణులు, అనుభవజ్ఞుల అభిప్రాయాలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. కేసీఆర్ కిట్ పథకం అమలుతో పాటు ప్రభుత్వ వైద్యశాలల్లో సదుపాయాలు మెరుగుపెట్టడం పేదలకు ఉపయోగపడిందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలపై ప్రజలకు నమ్మకం ఏర్పడి ఓపిక పెరిగిందన్న ఆయన.. వైద్యరంగంలో దోపిడీ ఆగిందని వ్యాఖ్యానించారు. అదే తరహాలో ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మేలు కలుగుతుందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అనాథ ఆడపిల్లలు పదోతరగతి వరకు కస్తూర్బా పాఠశాలల్లో చదువుతున్నారని తర్వాత వారి చదువుకు కావాల్సిన ఏర్పాట్లు చేసే విషయంలో ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. ఈ విషయంలో త్వరలోనే విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!