సచివాలయానికి కొత్త భవన సముదాయ నిర్మాణం నేపథ్యంలో ప్రస్తుత భవనాల్లోని కార్యాలయాల తరలింపు ప్రక్రియ వేగవంతమవుతోంది. కార్యాలయాలను ఆయా శాఖలకు సంబంధించిన శాఖాధిపతుల కార్యాలయాలకు తరలించాలని సూత్రప్రాయంగా ఇప్పటికే నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అందుబాటులో ఉన్న కార్యాలయాలను కూడా పరిశీలించారు.
సిద్ధంగా ఉండండి!
ఇప్పటికే ఆయా శాఖలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఏ శాఖను ఎక్కడకు తరలించాలన్న విషయమై ముసాయిదా ప్రతిపాదనలను కూడా రూపొందించారు. తరలింపునకు ఎంత సమయం అవసరమన్న సమాచారాన్ని తీసుకుని సిద్ధంగా ఉండాలని ఆయా శాఖలకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు.
బూర్గుల భవనానికి సీఎం, సీఎస్ కార్యాలయాలు
మెజార్టీ శాఖల కార్యాలయాలు సంబంధిత శాఖాధిపతుల కార్యాలయాలకు వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి, సీఎస్ కార్యాలయాలతో పాటు సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖలను బూర్గుల రామకృష్ణారావు భవన్‌కు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
గగన్ విహార్‌కు తరలించే అవకాశం
లక్డీకపూల్‌లోని సీఐడీ కార్యాలయం, బేగంపేటలోని క్యాంపు కార్యాలయాలను కూడా ప్రత్యామ్నాయాలుగా పరిశీలిస్తున్నారు. శాఖాధిపతులతో సంబంధం లేకుండా మొత్తం సచివాలయాన్ని నాంపల్లిలోని గగన్ విహార్‌కు తరలించాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
నేడు సీఎం సమీక్ష
సచివాలయ తరలింపు ప్రతిపాదనలు, ప్రణాళికపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు, సీనియర్ అధికారులతో చర్చించి ప్రణాళికపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే వారం నుంచి సచివాలయ తరలింపు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
- ఇదీ చూడండి : ఉత్కంఠ పోరులో విజయం లంకదే