ఆక్యుపెన్సీ రేషియా పెంచుకోవడంతో పాటు ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత కసరత్తు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. ఆర్టీసీ స్థితిగతులపై సీఎం ప్రగతిభవన్లో సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, అధికారులతో సమావేశమైన సీఎం... సంస్థ స్థితిగతులపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితి, ఆదాయ వ్యయాలు, లాభనష్టాలు, ఆక్యుపెన్సీ రేషియా, ప్రణాళికలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. కరోనా తర్వాత బస్సులకు ప్రజల నుంచి స్పందన, కార్గో సేవల గురించి ముఖ్యమంత్రి ఆరా తీశారు. అన్ని వివరాలు తెలుసుకున్న సీఎం కేసీఆర్... ఆర్టీసీపై మరోమారు పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.
అప్రమత్తత అవసరం..
వానాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు వ్యాప్తిచెందకుండా చేపట్టాల్సిన ముందస్తు నియంత్రణా చర్యలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్... అనుమానితులకు తక్షణమే జ్వరపరీక్షలు చేసి నిర్ధరించుకోవాలని సూచించారు. ఇందుకోసం... అన్ని ఆసుపత్రుల్లో పరీక్షలు, చికిత్సకు సంబంధించి అన్ని ఏర్పాట్లుచేయాలని వైద్యారోగ్యశాఖను ఆదేశించారు. దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని... పంచాయతీరాజ్, పురపాలకశాఖల అధికారులను ఆదేశించిన కేసీర్... నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. ఐఆర్ఎస్, ఫాగింగ్ వంటి లార్వా నియంత్రణ కార్యక్రమాలు చేపట్టాలని... దిశానిర్దేశం చేశారు. నివాసాల్లో నీరు నిల్వ లేకుండా చూడటం సహా దోమకాటు బారినపడకుండా పిల్లలు, వృద్ధులను కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు.
ఇదీ చూడండి:
CM KCR: అంగన్వాడీ కేంద్రాలు సహా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల పునఃప్రారంభం