ధీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. అందులో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ, ఐటీడీఏ అధికారులతో సీఎం కేసీఆర్ ఇవాళ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతిభవన్ వేదికగా జరగనున్న సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు. పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల పరిరక్షణ, హరితహారంపై సమావేశంలో చర్చిస్తారు.
సీఎంకు అధికారుల నివేదిక..
రాష్ట్రంలో ఏడు లక్షలకు పైగా ఎకరాలకు సంబంధించి పోడు భూముల సమస్య ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అటవీ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు గత మూడు రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. పోడు సమస్య అధికంగా ఉన్న 13 జిల్లాలకు చెందిన కలెక్టర్లు, అటవీ సంరక్షణాధికారులు, డీఎఫ్ఓలు, ఏటీడీఏ పీఓలు, డీటీడీఓలు, డీపీఓలు, ఆర్డీఓలు, కొంత మంది క్షేత్రస్థాయి అధికారులు, తహసీల్దార్లతో సమావేశమయ్యారు. ఆయా జిల్లాలు, ప్రాంతాల్లో పోడుభూముల సమస్యకు సంబంధించిన వివరాలు, పరిస్థితులపై ఆరా తీశారు. అటవీ ప్రాంతాల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, హరితహారంపై కూడా చర్చించారు. వాటన్నింటి ఆధారంగా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక సమర్పిస్తారు. క్షేత్రస్థాయి పర్యటనలో వెల్లడైన అంశాలు, సమీక్షల్లో కలెక్టర్లు, ఇతర అధికారులు అందించిన వివరాలు, సమాచారాన్ని సీఎంకు నివేదిస్తారు.
తీసుకోవాల్సిన చర్యలపై చర్చ..
మంత్రివర్గ ఉపసంఘం నివేదికతో పాటు ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా ఇవాళ్టి సమావేశంలో పోడుభూముల సమస్యపై విస్తృతంగా చర్చిస్తారు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారంతో పాటు భవిష్యత్‌లో అటవీ విస్తీర్ణం తగ్గకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తారు. అటవీహక్కుల పరిరక్షణ చట్టం, పోడు చేస్తున్న వారిని మరో చోటికి తరలింపు, పునరావాస చర్యలు, అటవీ పరిరక్షణ చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యలు, ఇకముందు ఆక్రమణలు జరగకుండా అనుసరించాల్సిన కార్యాచరణ, హరితహారంలో భాగంగా అడవుల పునరుజ్జీవం, రిజర్వ్ ఫారెస్ట్ వెలుపల మొక్కలు, చెట్లు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారిస్తారు.
పెండింగ్ దరఖాస్తుల పరిశీలన..
2006లో 96వేల దరఖాస్తులు పరిష్కరించి మూడు లక్షల ఎకరాలకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చారు. 91 వేల దరఖాస్తులను తిరస్కరించారు. వాటికి సంబంధించిన విస్తీర్ణం మూడు లక్షలా 27వేలకు పైగా ఉంది. మరో 53వేల ఎకరాలకు సంబంధించిన 15వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో తిరస్కరించిన, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను మరోసారి పరిశీలించి వారికి పట్టాలు ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. మిగతా వారికి సంబంధించి కూడా దరఖాస్తులు స్వీకరించి పరిశీలించనున్నారు. వీటితో పాటు ఇతర మార్గాలపైనా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
అడవుల పరిరక్షణపై దృష్టి..
పోడుభూముల సమస్య పరిష్కారంతో పాటే అడవుల పరిరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చే సమయంలోనే ఇందుకు సంబంధించి అండర్ టేకింగ్ తీసుకోవాలని యోచిస్తున్నారు. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేయాలన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వం....పోడు సమస్యను ఇప్పటికి పరిష్కరించి భవిష్యత్‌లో అటవీభూమి ఆక్రమణకు గురికాకుండా పటిష్ఠ కార్యాచరణ రూపొందించే ఆలోచనలో సర్కార్ ఉంది. చాలా చోట్ల అటవీప్రాంతాల అంచుల్లో పోడుసాగు చేస్తుండగా... కొన్ని చోట్ల మాత్రం అడవుల మధ్యలో పోడు వ్యవసాయం చేస్తున్నారు. అలాంటి వారిని అటవీప్రాంతాల అంచులకు తరలించాలని భావిస్తున్నారు. వారికి పట్టాలు, రైతుబంధు, రైతుబీమా వర్తింపచేయడం, వసతులు కల్పించే విషయమై సమావేశంలో చర్చించనున్నారు. అటవీ పరిరక్షణ కమిటీల ఏర్పాటు, విధివిధానాలతో పాటు ఏడు విడతల హరితహారం అమలు, ఫలితాలను సమావేశంలో విశ్లేషించి మరింత విస్తృత ఫలితాలు పొందేందుకు అనుసరించాల్సిన ప్రణాళికపైనా సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రత్యేకించి అటవీ ప్రాంతాల పునరుజ్జీవం, అటవీ సరిహద్దుల్లో కందకాల తవ్వకం, రక్షణ కోసం ప్రత్యేక మొక్కలు నాటడం లాంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.
రెవెన్యూ, అటవీ శాఖ మధ్య సమన్వయం లేకపోవటంతోనే ఇన్నేళ్లు సరిహద్దులను గుర్తించలేదని ఆరోపిస్తున్న అటవీ ప్రాంతాల ఎమ్మెల్యేలు......పోడుభూముల సమస్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తప్పకుండా పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: