పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో ప్రగతిభవన్‌లో 5 గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షించారు. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సీఎస్ సోమేశ్ కుమార్, ఆయా శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
అభివృద్ధి పనులపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కార్యక్రమం అమలవుతున్న తీరును సీఎం తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్లు, అధికారులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉందన్న అభిప్రాయంతో ఉన్న ముఖ్యమంత్రి... ఆ దిశగా వారికి దిశానిర్దేశం చేశారు. పల్లె, పట్టణ ప్రగతి అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఈ నెల 19వ తేదీ నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం గ్రామాలు, మండలాల వారీగా ఛార్టులు రూపొందించాలని సీఎస్‌ను ఆదేశించారు. వీటన్నింటి నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
అదనపు కలెక్టర్లకు నిధుల కేటాయింపు
పల్లె, పట్టణ ప్రగతి పనుల కోసం అదనపు కలెక్టర్లకు నిధులను కేటాయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పనుల మంజూరు కోసం అదనపు కలెక్టర్లకు రూ.25లక్షలు కేటాయించారు. సమీక్ష అనంతరం అదనపు కలెక్టర్లకు సీఎం కేసీఆర్ కొత్త కార్లను అందజేశారు. వాటిని జెండా ఊపి మంత్రి అజయ్ కుమార్ ప్రారంభించారు.