హైదరాబాద్ నగరానికి ఎప్పటికీ తాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు వెంటనే డెడికేటెడ్ మంచినీటి రిజర్వాయర్ నిర్మించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ల నుంచి గోదావరి నీటిని తరలించి, ప్రతిపాదిత జలాశయాన్ని ఎప్పటికప్పుడు నింపాలని సూచించారు. హైదరాబాద్ నగరానికి మంచినీటి రిజర్వాయర్ నిర్మించే విషయంపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో సమీక్ష నిర్వహించారు.
అంచనాలు రూపొందించండి
నీటి పారుదల శాఖ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సంయుక్తంగా సమావేశమై మంచినీటి రిజర్వాయర్, పైపులైన్లకు సంబంధించి అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రతీ ఇంటికీ మంచినీటి కనెక్షన్ ఇవ్వాలని చెప్పారు. ప్రస్తుతం గోదావరి, కృష్ణా నీళ్లను చాలా దూరం నుంచి హైదరాబాద్ తరలిస్తున్నామని... అయినా అవి ఏడాది పొడవునా నగర ప్రజల మంచినీటి అవసరాలు తీర్చలేకపోతున్నాయని సీఎం తెలిపారు. భవిష్యత్తులో ఇలా జరగడానికి వీల్లేదని అన్నారు.
కేశవరం దగ్గర రిజర్వాయర్
కాళేశ్వరం ద్వారా మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్లకు నీటి సరఫరా జరుగుతుందన్నారు. ఈ రెండు రిజర్వాయర్ల నుంచి హైదరాబాద్కు మంచినీళ్లు అందించాలని పేర్కొన్నారు. ఇందుకోసం కేశవరం దగ్గర రిజర్వాయర్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు నిర్మించాలన్నారు. అక్కడి నుంచి నగరానికి మంచినీటి సరఫరా చేయాలని... దీనికోసం వెంటనే అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గోదావరి, కృష్ణా నీటిని ప్రస్తుత పద్ధతిలో తరలిస్తూనే ప్రత్యామ్నాయంగా రిజర్వాయర్ కూడా నిర్మించాలని సీఎం వివరించారు.
ఇదీ చూడండి: శంషాబాద్లో 150 కిలోలకు పైగా బంగారం స్వాధీనం