ప్రధాని మోదీ అధ్యక్షతన వర్చువల్ విధానంలో... ఇవాళ నీతిఆయోగ్ ఆరో పాలకమండలి భేటీ జరగనుంది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు, సీఈఓ సహా సభ్యులు పాల్గొంటారు. వ్యవసాయం, మౌలిక వసతులు, తయారీ రంగం, మానవవనరుల అభివృద్ధి, కిందిస్థాయిలో సేవలు, వైద్యం, పౌష్టికాహారం తదితర అంశాలపై సమావేశంలో.. విస్తృతంగా చర్చించనున్నారు. ప్రత్యేకించి కోవిడ్, తదనంతర పరిణామాలపై అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టిసారిస్తారు.
ప్రభుత్వ కసరత్తు...
సమావేశంలో... రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేసింది. వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన విజయాలు తెలుపుతూ సంక్షిప్త నివేదికలు సిద్ధంచేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు, విధానాలతో... నివేదికలను రూపొందించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలైన... టీఎస్- ఐపాస్, కేసీఆర్ కిట్, రైతు భీమా, రైతుబంధు తదితర పథకాల తీరుతెన్నులు పొందుపర్చారు. ఆయారంగాల్లో రాష్ట్ర విజయాలతో పాటు నీతిఆయోగ్ ఇచ్చిన ర్యాంకుల వివరాలను సిద్ధంచేశారు.
భవిష్యత్ ప్రణాళికల ప్రస్తావన...
కొత్త రాష్ట్రమైన తెలంగాణ అనతికాలంలోనే సాధించిన విజయాలను నీతిఆయోగ్ సమావేశంలో వివరించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్... భవిష్యత్ ప్రణాళికలను ప్రస్తావించే అవకాశం ఉంది. వ్యవసాయం, పరిశ్రమలు, తయారీ రంగం, వైద్యరంగం, మౌలికవసతుల సంబంధిత అంశాలను... ప్రధానంగా ప్రస్తావిస్తారని అంటున్నారు. కేంద్రప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన సహకారం, మద్దతు అంశాలను కేసీఆర్.... నీతిఆయోగ్ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. కరోనా తర్వాత.... రాష్ట్రాల ఆదాయాలు గణనీయంగా పడిపోవడం, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న పరిస్థితుల్లో...... కేంద్రం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కొన్ని అంశాలను ప్రస్తావిస్తారని చెబుతున్నారు. రాష్ట్రానికి సంబంధించి నీతిఆయోగ్ గతంలో చేసిన సిఫారసుల అమలును సమావేశంలో ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశం ఉంది.