Tollywood Lyricist Kandikonda: ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత కొద్దికాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న కందికొండ యాదగిరి(49).. వెంగళరావునగర్‌లోని తన ఇంట్లో ఈరోజు(మార్చి 12) తుదిశ్వాస విడిచారు. తెలంగాణ సంస్కృతిని తన పాట ద్వారా అజరామరంగా నిలిపిన ఓరుగల్లు బిడ్డ కందికొండ మరణం.. సాహిత్య లోకానికి, సబ్బండ వర్గాలకు తీరని లోటని సీఎం తెలిపారు. పాటల రచయితగా తెలుగు సినీ సాహిత్య రంగంలో కందికొండ తనదైన ముద్ర వేశారని కేసిఆర్ స్మరించుకున్నారు. కందికొండను కాపాడుకునేందుకు ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసినా... ఫలితం దక్కకపోవటం దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. కందికొండ యాదగిరి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసిఆర్.. ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
బండి సంజయ్ సంతాపం..
కందికొండ యాదగిరి మృతికి భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అద్భుతమైన బతుకమ్మ పాటలతో పాటు అనేక జానపద గీతాలు రాసి.. తెలంగాణ సంస్కృతిని కందికొండ బతికించారని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేసిన రచయిత కందికొండ మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈటల సంతాపం..
కందికొండ మృతిపట్ల మాజీ మంత్రి ఈటల రాజేందర్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ.. ఓ గొప్ప కవిని కోల్పోయిందన్నారు. ఆయన మృతి తీరని లోటన్నారు. కందికొండ కుటుంబసభ్యులకు ఈటల ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇటీవలే వెన్నుముక శస్త్రచికిత్స..
గత కొంతకాలంగా తీవ్ర ఆనారోగ్యంకో బాధపడుతున్న కందికొండ పరిస్థితి పూర్తిగా విషమించడంతో శనివారం(మార్చి 12) మృతి చెందినట్లు వెద్యులు తెలిపారు. కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఆ వ్యాధిని జయించినా.. ఆ వ్యాధి ప్రభావం వెన్నెముకపై పడటంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆర్థికంగానూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, స్నేహితుల సహకారంతో ఇటీవలే వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నా.. పూర్తి స్థాయిలో కోలుకోలేదు.
ఇదీ చూడండి: