cm kcr on mahthma gandhi: ప్రశాంత భారతదేశంలో కొన్ని చిల్లరమల్లర ప్రయత్నాలతో జాతిని చీల్చడానికి జరుగుతున్న కుట్రలను ఐక్యంగా అడ్డుకుందామని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు ఇచ్చారు. భారత స్వాతంత్య్ర పోరాట సారథి, ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాంతిదూత, విశ్వమానవుడు, స్ఫూర్తిప్రదాత అయిన మహాత్మాగాంధీని కించపరిచే ఘటనలు జరుగుతున్నాయని, ఉద్దేశపూర్వకంగా ఆయనపై కొందరు విద్వేషం రగిలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ శక్తుల ప్రయత్నాలు ఫలించవని తెలిపారు. దేశంలో అలజడులను సృష్టించిన దుర్మార్గులను తరిమి కొట్టిన చరిత్ర భారతదేశానికి ఉందని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం తెలంగాణ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. త్యాగాలు, పోరాటాలు.. ఆవేదనలతో సిద్ధించిన స్వాతంత్య్ర స్ఫూర్తిని అందరికీ తెలిసేలా వాడవాడలా.. గ్రామగ్రామాన అద్భుతంగా స్వతంత్ర వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నామని, ఎంతోమంది కష్టపడ్డారని, అలాగే అవసరమైతే తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో వెళ్లి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలను సోమవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.
కొత్తతరానికి తెలియాలి: "స్వాతంత్య్ర సంగ్రామం మహోజ్వల చరిత్ర. అది కొత్త తరం పిల్లలకు, కొత్త తరం రాజకీయ నేతలు చాలా మందికి తెలియదు. ఈనాడున్న భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి చాలా సమయం పట్టింది. సుమారు ఒకటిన్నర శతాబ్దం పాటు కొనసాగిన పోరాటం, అనేకమంది పెద్దలు, అనేక రకాల పద్ధతుల్లో వలస పాలకులకు వ్యతిరేకంగా చేసిన అపురూపమైన త్యాగాలతో అది సిద్ధించింది. 1857 సిపాయిల తిరుగుబాటు ఫలించలేదని ఉద్యమకారులు ఏనాడూ నిరాశ చెందలేదు. వైఫల్యాన్ని పాఠంగా నేర్చుకొని పోరాటాన్ని కొనసాగించారు. బాలగంగాధర్ తిలక్ నేతృత్వంలో అనేక సాంస్కృతిక పోరాటాలు వచ్చాయ్. లాలా లజపతిరాయ్, బిపిన్‌చంద్ర పాల్..ఇలా అనేక మంది పోరాటాలు చేశారు. ఝాన్సీ లక్ష్మీబాయి, ఎంతో మంది రాజులు, సంస్థానాదీశులు ఆసేతుహిమాచలం ఒక్కటై పోరాటం జరిపారు. ఏ దేశం స్థిరపడాలన్నా.. అనేక రకాల ఒడిదొడుకులు, ఒత్తిళ్లు ఉంటాయి. దేశానికి సమగ్రత, స్వరూపం రావాలంటే చాలా సమయం తీసుకుంటుంది. దాని వెనుక చాలా ప్రయాస, శ్రమ, మేధోమథనం, ఆలోచనలు కలగలిసి ఉంటాయి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు చాలా విచిత్రమైన పరిస్థితి ఉండేది. ఆ సమయంలో సుమారు 584 మంది రాజులు పాలించే సంస్థానాలు ఉండేవి. మహాత్మాగాంధీ, వల్లభ్‌భాయ్ పటేల్, నెహ్రూ తదితర పెద్దలందరు కూడా విశేష కృషిచేసి రాజులందరినీ ఒప్పించి దేశాన్ని ఒకటిగా చేయడానికి యత్నించారు. 1948 సెప్టెంబరు 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది.ఈ రోజు మన కళ్లముందు కనిపిస్తున్న భారతదేశాన్ని అందించేందుకు వారుపడ్డ ప్రయాస, చేసిన కృషి ఎనలేనివి. ఈ సందర్భంగా మనందరి తరఫున వారందరికీ వినయపూర్వకమైన జోహార్లు, నమస్సులు అర్పిస్తున్నా. దేశం కోసం తమ సర్వస్వాన్ని ధారవోసి, మరణానికి వెనుకాడకుండా మడమతిప్పని పోరాటాలు చేసిన సమరయోధుల స్ఫూర్తి, త్యాగనిరతితో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరముంది. ఆస్ఫూర్తిని గ్రామగ్రామాన, గడప గడపకూ చాటేలా అద్భుతంగా వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలి.
"తెలంగాణను కొంతలో కొంత బాగుచేసుకోగలిగాం. రాష్ట్రం కావాలనే పోరాటం, ఆ తదనంతర కాలంలో ఎనిమిది సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని కొన్ని ప్రాథమిక మౌలిక వసతులు కల్పించుకోగలిగాం. ఇంకా పురోగమించాల్సింది చాలా ఉంది. మంత్రులు, మండలి, శాసనసభ అధిపతులు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, సభలో ఉన్న అందరూ ఈ పవిత్ర కర్తవ్యాన్ని తీసుకొని ముందుకుపోవాలి. దేశంలో పేదరికం ఉన్నంతవరకు ఆక్రందనలు కొనసాగుతూనే ఉంటాయ్. దాన్ని నిర్మూలిస్తేనే మన సమాజానికి శాంతి, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం లభిస్తాయి. ప్రజల ఆకాంక్షలు ఆశించినస్థాయిలో చేరలేదు. పేదరికం కొంత కొనసాగుతోంది. దళిత సమాజం మాకు జరగాల్సింది జరగలేదని ఆక్రోశిస్తూనే ఉంది. ఇంకా కొన్ని అల్పాదాయ వర్గాలు, అన్ని జాతులు, వర్గాల్లో ఉండే పేదలు తమ బాధను చెబుతున్నారు. అనేక రకాలుగా అశాంతి ప్రదర్శితమవుతోంది. వీటన్నింటిని అధిగమించాలంటే ప్రజాజీవితంలో ఉన్న మనమందరం స్వార్థం, సంకుచితమైన భావాలు పక్కనపెట్టి.. విశాల దృక్పథంతో పేదలు, దీనులు, అన్నార్తుల సౌభాగ్యం కోసం ఈ వజ్రోత్సవ దీప్తితో కంకణధారులం కావాలని శిరస్సు వంచి ప్రణమిల్లి మనవి చేస్తున్నా. స్వయంపాలనలో భారతావని అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. 15వ తేదీకి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతాయి. ఏ దేశానికైనా స్వేచ్ఛ, స్వాతంత్య్రం అనేవి అపురూపమైనవి. సుదీర్ఘకాలం స్వయంపాలనలో సుసంపన్నమైన భారతదేశంలో తరాలు మారుతున్నాయి. కొత్త తరాలు వస్తున్నాయి. స్వాతంత్య్ర సముపార్జనకు జరిగిన పోరాటాలు, త్యాగాల గురించి కొత్తతరాలకు తెలియదు. సందర్భోచితంగా తెలియజేయడం పాతతరం కర్తవ్యం."
-కేసీఆర్,సీఎం
మహాత్మునిపై అనుచిత వ్యాఖ్యలా?: గాంధీ ఈ ప్రపంచంలో పుట్టకపోయి ఉంటే.. తాను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాడినే కాదని బరాక్ ఒబామా అన్నారు. మహాత్మాగాంధీ లాంటి వ్యక్తి రక్తమాంసాలతో పుట్టి ఈ భూమి మీద నడయాడుతాడని అనుకోలేదని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ కొనియాడారు. ఆఫ్రికాలో ఎంతో పోరాటం చేసిన నెల్సన్‌మండేలా..తనకు స్ఫూర్తి ప్రదాత గాంధీ అని పేర్కొన్నారు. గాంధీ విశ్వమానవుడు.. ఆయనను కన్నది నా భరతజాతి. దానికి వారసులం మనమందరం. అలాంటి మహాత్ముడిని కించపరుస్తున్న కొన్ని ఘటనలు అంతులేని బాధను కలిగిస్తున్నాయి. నా చిన్ననాటి నుంచి నేటి వరకు అనేక వందలు, వేల సందర్భాల్లో ‘బోలో స్వతంత్ర భారత్‌కీ జై.. మహాత్మా గాంధీకి జై’ అని నినదించిన నాలుక ఇది. గాంధీ చిత్రపటాలను నెత్తిన పెట్టుకొని కోటానుకోట్ల మంది ఊరేగిన దేశమిది. చౌటుప్పల్‌వద్ద ఒక దేశభక్తుడు మహాత్ముడికి గుడి కూడా కట్టారు. జాతిపితగా మనమే బిరుదాంకితుడిని చేసుకున్న గొప్ప మానవతావాది మహాత్మాగాంధీ. ఆయనను కించపరిచే దురదృష్టకరమైన సంఘటనలు దేశానికి, జాతికి ఏమాత్రం మంచిదికాదు. ప్రపంచంలో ఏ జాతి తన చరిత్రను తను మలినం చేసుకోదు. అటువంటి వెకిలి మకిలి ప్రయత్నాలు ఎక్కడ జరిగినా మనందరం ఏకోన్ముకంగా ఖండించి.. మహాత్ముడి కీర్తి విశ్వవాప్తమయ్యేలా ప్రయత్నం చేయాలని ప్రార్థిస్తున్నా. మహాత్ముడు ఎన్నడూ మహాత్ముడిగానే ఉంటారు. ఎవరో కొందరు చిల్లరమల్లర ఆలోచనలతో చేసే ప్రయత్నాలు ఎప్పుడూ నెరవేరవు. మహాత్ముడి దేశంగానే భారతదేశం ఉంటుంది అని బలంగా నమ్మే వ్యక్తుల్లో నేను ఒకడిని’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి: కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలకు సీఎం కేసీఆర్ అభినందనలు