భూముల క్రయవిక్రయాలను పూర్తిగా ఆన్‌లైన్‌లో జరిపేందుకు... రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 'ధరణి' పోర్టల్‌ను.. ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆవిష్కరించిన ఆయన... కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు పొందుపర్చినట్టు వివరించారు. పారదర్శకంగా మారిన వ్యవస్థలో ఏ ప్రజాప్రతినిధి, అధికారి తప్పు చేయజాలరని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
బాధ్యత తహసీల్దార్లదే..
ధరణి పోర్టల్‌తో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. రిజిస్ట్రేషన్లకు పూర్తి బాధ్యులు తహసీల్దార్లేనని పేర్కొన్న సీఎం... వారి వేలిముద్రలతోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. డాక్యుమెంట్ రైటర్లు ఇష్టారీతిన వసూళ్లు చేయడం కుదరన్న ఆయన... రిజిస్ట్రేషన్ ఛార్జీల విషయంలో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు.
చివరి అవకాశం..
దేశంలో గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకుసాగుతున్నమని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందులో భాగంగా నిర్మిస్తున్న 2,601 రైతు వేదికలు 95శాతం పూర్తయ్యాయని చెప్పారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. సాదాబైనామాలకు ఇదే చిట్టచివరి అవకాశమన్న కేసీఆర్... తర్వాత రిజిస్ట్రేషన్ ద్వారానే మార్పులు జరుగుతాయని వివరించారు. సాదాబైనామాల గడువు మరోవారం పొడగిస్తున్నట్టు ప్రకటించారు.
త్వరలో పరిష్కరిస్తాం..
త్వరలో భూముల లెక్కలు తేల్చేందుకు సమగ్ర భూ సర్వే చేయనున్నట్టు వెల్లడించారు. సంపూర్ణ భూహక్కు యాజమాన్య చట్టం తీసుకువస్తామన్న కేసీఆర్... ఇందుకు రెండేళ్లు పడుతుందని తెలిపారు. అతి త్వరలో వీఆర్వోల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పారదర్శక సేవలు అందించడమే లక్ష్యంగా ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిన ఉద్యోగులను కేసీఆర్ అభినందించారు. దేశానికి ఒక మార్గదర్శిగా తీర్చిదిద్దాలని ఆకాక్షించారు.
ఇదీ చూడండి: 'ధరణి'లో స్లాట్ బుకింగ్ ఎలా చేయాలో... తెలుసుకుందాం