తెలంగాణభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన తెరాస శాసనసభపక్షం (TRSLP Meeting ) భేటీ అయింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీ అభ్యర్థులు హాజరయ్యారు. ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను కేసీఆర్ అభినందించారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం, భాజపా వైఖరిపై సమావేశంలో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక తీరు... రాష్ట్ర భాజపా మరోతీరు వ్యవహరిస్తూ రైతులను అయోమయానికి గురి చేస్తోందని తెరాస ఆరోపిస్తోంది. ఈనెల 12న నియోజవర్గాల వారీగా ధర్నాలు కూడా నిర్వహించింది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టతనిచ్చే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని ఇప్పటికే ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఈ భేటీలో భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేయనున్నారు.
విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టే వ్యూహాలు..
దిల్లీలో రైతుదీక్ష లేదా ధర్నా చేపట్టాలని తెరాస భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై ముప్పేట దాడికి ప్రణాళికలు రచిస్తున్న తెరాస... వాటిపై సమావేశంలో చర్చించనుంది. కేంద్రం వైఖరి, రాష్ట్రానికి జరగుతున్న అన్యాయం, భాజపా అనుసరిస్తున్న వైఖరితో పాటు.. విపక్షాల ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలనే అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. దిల్లీ స్థాయి ఆందోళనతో పాటు రాష్ట్రంలో ఏ రూపంలో కొనసాగించాలో వ్యూహాలను ఖరారు చేసే అవకాశం ఉంది.
ఉపఎన్నిక పరిణామాల ప్రస్తావన..
రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపైనా సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే తొమ్మిది జిల్లాల్లో పార్టీ ఇన్‌ఛార్జుల నియామకంతో పాటు, వారికి బాధ్యతలను సీఎం కేసీఆర్ (CM KCR) ఖరారు చేయనున్నారు. ఈ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌గా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. తెరాస ప్లీనరీ, హుజూరాబాద్ ఉపఎన్నిక పరిణామాలనూ కేసీఆర్ ప్రస్తావించే వీలుంది. భాజపా, కాంగ్రెస్, ఇతర విపక్షాలపై ఎదురుదాడి, తెరాస వ్యూహం తదితర అంశాలపైనా ఆయన సూచనలివ్వనున్నారు.
ఇదీ చదవండి : KTR Comments: 'నేను కూడా ఓటీటీకి అభిమానినే'