Ramadan Celebrations 2022: ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ వేడుకలు కొనసాగుతున్నాయి. ముస్లింలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు చేస్తూ... పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా మతపెద్దలు ఉపవాస దీక్షల సారాంశం, రంజాన్ విశిష్టతను తెలియజేశారు. ఈద్గాల వద్దకు వెళ్లిన పలువురు ప్రముఖులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
రంజాన్ పర్వదినం ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి తెలంగాణ పెట్టింది పేరని పేర్కొన్నారు. రంజాన్ విశిష్టత.. దాతృత్వం, సోదరభావం, కరుణ, ప్రేమ, శాంతి స్ఫూర్తిని సూచిస్తుందని తెలిపారు.
'ఈ పవిత్రమైన రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల జీవితాల్లో మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, శాంతిని నెలకొల్పాలని కోరుకుంటున్నాను. పవిత్ర రంజాన్ అనేది భగవంతుడు నిర్ణయించిన జీవిత ఉద్దేశాన్ని మనందరికీ గుర్తు చేస్తుంది. కఠినమైన స్వీయ, క్రమ శిక్షణల ద్వారా మాత్రమే శాశ్వత జీవితాన్ని గ్రహించడం సాధ్యమవుతుంది. ఈ పవిత్ర ఈద్ - ఉల్ - ఫితర్ రోజున మానవుని గౌరవం, జీవిత పవిత్రత, అన్ని విశ్వాసాల గంభీరతను గౌరవిస్తామని ప్రతిజ్ఞ పూనుదాం.' -గవర్నర్, తమిళసై సౌందరరాజన్
తెలంగాణలో గంగాజమునా తహజీబ్‌కు రంజాన్ పర్వదినం ప్రతీకని సీఎం కేసీఆర్ అన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని సీఎం ఆకాంక్షించారు.
'ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలి. పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలి.రంజాన్‌మాసం క్రమశిక్షణాయుత జీవనశైలిని పెంపొందిస్తుంది. మానవసేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ అందిస్తుంది. గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక. లౌకికవాదం, మత సామరస్యంలో తెలంగాణ దేశానికే ఆదర్శం.'
-సీఎం, కేసీఆర్
హైదరాబాద్ చార్మినార్ మక్కా మసీద్, మీరాలం ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. రంజాన్ సందర్భంగా పాతబస్తీ ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సనత్‌నగర్‌లోని వెల్ఫేర్ గ్రౌండ్‌లో నిర్వహించిన ప్రార్థనల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అన్ని కులమతాలను ఒకే విధంగా చూసిన ఘనత తెరాస ప్రభుత్వానికి చెందుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఆదిలాబాద్‌లోని ఈద్గా మైదానంలో రంజాన్‌ను పురస్కరించుకుని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మతపెద్ద రంజాన్ ఉపవాసదీక్షల సారాంశాన్ని వివరించారు. ప్రార్థనల అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుంటూ పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఇవీ చదవండి :