30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో విద్యుత్ శాఖ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 30 రోజుల కార్యాచరణ ముగిసినప్పటికీ విద్యుత్ శాఖ సిబ్బంది ఇంకా గ్రామాల్లో పనులు చేస్తూనే ఉన్నారని అభినందించారు. ప్రగతిభవన్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. తాను 1985 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నానని, అప్పటి నుంచి గ్రామాల్లో విద్యుత్ సంబంధిత సమస్యలు ఉంటున్నాయని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి ఇప్పటి వరకు ఇంత పెద్ద ప్రయత్నం జరగలేదన్నారు.
ఇప్పటికీ గ్రామాల్లోనే ఉన్నారు
నిర్దేశించిన పనుల్లో ఇప్పటికే 60 శాతానికి పైగా పూర్తి చేసిన విద్యుత్ శాఖ, మిగతా పనుల కోసం ఇప్పటికీ గ్రామాల్లో విధులు నిర్వర్తించడం గొప్ప విషయమని కేసీఆర్ తెలిపారు. 30 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా విద్యుత్ శాఖ సిబ్బంది.. గ్రామాల వారీగా పవర్ వీక్ నిర్వహించారని... వంగిన, తుప్పు పట్టిన స్తంభాలు 1,67,154 ఉన్నట్లు గుర్తించారని చెప్పారు. వంగిన వాటిని సరిచేశారని.. తుప్పు పట్టిన వాటి స్థానంలో కొత్త స్తంభాలు వేశారని.. రెండు పోళ్ల మధ్య ఎక్కువ దూరం ఉండడం వల్ల వైర్లు వేలాడకుండా, మధ్యలో మరో స్తంభం వేస్తున్నారని సీఎం వివరించారు.
సమస్య పరిష్కారానికి కమిటీ
గ్రామాల్లో వీధిలైట్ల నిర్వహణ కోసం 6,834 కిలోమీటర్ల మేర కొత్త వైరు వేస్తున్నారన్నారు. వీధిలైట్ల కోసం ఏర్పాటు చేసిన 7,527 కరెంటు మీటర్లు పాడైపోయినందున, వాటి స్థానంలో కొత్త మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని... వీధిలైట్ల నిర్వహణ కోసం కొత్తగా 2,54,424 కరెంటు మీటర్లు బిగిస్తున్నారని సీఎం పేర్కొన్నారు. ఎస్టీ ప్రాంతాల్లో త్రీఫేజ్ కరెంటు కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఏజన్సీ ప్రాంతాలతో పాటు, ఇతర ఎస్టీ తండాలు, గూడేలున్న ప్రాంతాల్లో త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎస్టీలు నివసించే ప్రాంతాల్లో విద్యుత్ సమస్య పరిష్కరించడానికి ముగ్గురు సీనియర్ ఐఎఎస్ అధికారులతో కమిటీని నియమించారు. ఇందులో సోమేశ్ కుమార్, రఘునందన్ రావు, అజయ్ మిశ్రా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
ఇదీ చూడండి: ప్లాస్టిక్ రహిత తెలంగాణే లక్ష్యం: కేసీఆర్