పెట్రోల్, డీజిల్‌పై ఒక్క రూపాయి కూడా తగ్గించేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తాము నయా పైసా పెంచలేదని... తగ్గించే ప్రసక్తే లేదని చెప్పారు. పెట్రోల్ ధరలను పెంచిన వాళ్లే తగ్గించాలని డిమాండ్ చేశారు. చమురుపై కేంద్రం విధిస్తున్న సెస్‌ను రద్దు చేయాలని అన్నారు. పెట్రో ధరలను కేంద్రమే అడ్డదారిలో పెంచిందన్న కేసీఆర్.. చమురుపై సెస్ రద్దు చేసేవరకు కేంద్రంపై పోరాడుతామన్నారు.
కొండంత పెంచి, పిసరంత తగ్గించారు..
4 రాష్ట్రాల్లో ఎన్నికలు రానున్నందునే ఎక్సైజ్ సుంకం తగ్గించినట్టు కేసీఆర్ విమర్శించారు. పెట్రో ధరలు కొండంత పెంచి, పిసరంత తగ్గించారని దుయ్యబట్టారు. కేంద్రం పెంచిన పెట్రోల్ ధరల వల్ల అన్ని వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయని కేసీఆర్ తెలిపారు. అన్ని నిత్యావసరాల ధరలు పెరగటం వల్ల పేద ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయని.. దానికి కారణం కేంద్రమేనని విరుచుకుపడ్డారు. రూ.75కే లీటర్ పెట్రోల్ ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
కేంద్రంపై పోరాడుతాం..
"పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం అద్భుతంగా అబద్ధాలు చెబుతోంది. రాష్ట్రాల వాటా ఎగ్గొడుతూ కేంద్రం సెస్ పెంచింది. ఈ ఏడేళ్లలో క్రూడాయిల్ ధర ఎప్పుడూ 105 డాలర్లు దాటలేదు. బ్యారెల్ ధర 30 డాలర్లు ఉన్నప్పుడు కూడా భారీగా ధర పెంచారు. దేశంలో జరిగిన ఉప ఎన్నికల్లో భాజపాను ప్రజలు దెబ్బకొట్టారు. అందుకే కొండంత పెంచిన పెట్రో ధరలను పిసరంత తగ్గించారు. పెట్రోల్, డీజిల్‌పై మేము నయా పైసా తగ్గించేది లేదు. పెట్రోల్‌పై మేము వ్యాట్ పెంచలేదు. రాష్ట్రంలో వ్యాట్ ఒక్క రూపాయి కూడా పెంచేది లేదు, తగ్గించేది లేదు. పెట్రోల్ ధరలు పెంచిన వాళ్లే తగ్గించాలి. చమురుపై కేంద్రం విధిస్తున్న సెస్‌ను రద్దు చేయాలి. కేంద్రం రూ.75కే లీటర్ పెట్రోల్ ఇవ్వాలని మా డిమాండ్. పెట్రోల్ ధర పెంపునకు కారణమైన వాళ్లను నిలదీస్తాం. చమురుపై కేంద్రం విధిస్తున్న సెస్‌ను రద్దు చేయాలి. చమురుపై సెస్ రద్దు చేసేవరకు కేంద్రంపై పోరాడుతాం. ఈ క్రమంలో ఎవరెవరిని కలుపుకుపోవాలో వాళ్లందరిని కలుపుకుని పోతాం. కేంద్రం అడ్డగోలుగా పెంచి.. పిసరంత తగ్గించగానే.. రాష్ట్రం తగ్గించాలని రాష్ట్ర భాజపా నాయకులు మాట్లాడుతున్నారు. ఏ నైతికతతోని అడుగుతున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా హుందాగా మాట్లాడాలి. భాజపా నేతలు అడ్డగోలుగా మాట్లాడితే ఇకపై సహించం. ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడితే చీల్చి చెండాడుతాం. కేంద్రం అసమర్థతను రాష్ట్రాలపై రుద్దుతారా?" - కేసీఆర్, సీఎం
ఇదీ చూడండి: