CM KCR in Muchital: వైభవోపేతంగా జరుగుతున్న ముచ్చింతల్ సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ సతీసమేతంగా పాల్గొన్నారు. భక్తులు, వేద పండితుల శ్రీమన్నారాయణ నామస్మరణతో బుధవారం(ఫిబ్రవరి 2న) శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలకు అంకురార్పణ జరగ్గా.. రెండో రోజు కైంకర్యాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. మొదటగా.. సమతామూర్తి కేంద్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. చినజీయర్ స్వామితో కలిసి విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించారు. 216 అడుగుల సమతామూర్తి చుట్టూ తిరిగి నిర్మాణాన్ని గమనించారు. యాగ క్రతువులను పరిశీలించారు. సీఎం కేసీఆర్‌తో పాటు వేడుకల్లో ఏపీ ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
రెండో రోజు క్రతువులు..
సహాస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు అరణి మథనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ మహాక్రతువులో నేడు ప్రధాన ఘట్టమైన శ్రీలక్ష్మి నారాయణ మహా యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం యాగశాలలో శాస్త్రోక్తంగా అగ్నిహోత్రాన్ని తయారుచేశారు. ప్రధాన యాగ మండపంలో శమి, రావి కర్రలను రాపిడి చేసి బాలాగ్నిని రగిలించారు. ఆ అగ్నిహోత్రాన్ని పెద్దది చేస్తూ యాగశాలలో ఏర్పాటు చేసిన 1035 కుండలాలకు తీసుకెళ్లారు. యాగశాలను 114 శాలలుగా విభజించి హోమాలను చేస్తున్నారు.
14 వరకు మహాయాగం..
శ్రీత్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో అయోధ్య, నేపాల్,తమిళనాడు తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని జీయర్ స్వామలు హాజరై శ్రీలక్ష్మినారాయణ మహా యాగాన్ని నిర్వహిస్తున్నారు. యాగశాలకు కుడివైపు భాగాన్ని శ్రీరంగ క్షేత్రానికి ప్రతీకగా భోగ మండపం, మధ్య భాగాన్ని తిరుమల క్షేత్రానికి గుర్తుగా పుష్ప మండపం, వెనుక వైపు ఉన్న భాగాన్ని కాంచిపురానికి గుర్తుగా త్యాగ మండపం, ఎడమ వైపు ఉన్న మండపాన్ని మేలుకోట కేత్రంగా భావిస్తూ జ్ఞాన మండపంగా నామకరణం చేసినట్లు చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. ఒక్కో యాగశాలలో 9 కుండాలను ఏర్పాటు చేసి 18 మంది ప్రధాన ఋత్వాకులతో యాగం జరుగుతోంది. అందులో 4 వేదాల్లోని 9 శాఖల్లో నిష్ణాతులైన వేద పండితులు హవనం చేస్తున్నారు. ఈ లక్ష్మి నారాయణ మహాయాగం ఈ నెల 14 వరకు కొనసాగనుంది.
హరీశ్‌రావు పర్యవేక్షణ..
శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు. కరోనా నిబంధనలు అమలవుతున్నాయో లేదో చూశారు. మరోవైపు.. ఎల్లుండి ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. ఈ క్రమంలో ముచ్చింతల్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. జీవా ప్రాంగణంలో అధికారులు హెలికాప్టర్ ట్రయల్స్ నిర్వహించారు.
సంబంధిత కథనాలు :