30 రోజుల ప్రణాళికపై హర్షం:
30 రోజుల ప్రణాళిక ఆశించిన ఫలితాలు సాధించిందని సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల పరిషత్, జిల్లా పరిషత్లకూ నిర్దిష్టమైన విధులు, నిధులు, బాధ్యతలు అప్పగించడానికి కసరత్తు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. త్వరలోనే ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ ఛైర్మన్లతో హైదరాబాద్లో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆర్థిక సంఘం నిధులను ప్రతీ నెలా రూ.339 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఇదే తరహాలో మండల, జిల్లా పరిషత్లకూ నిధులు విడుదల చేస్తామని సీఎం వెల్లడించారు.
ఆదర్శ గ్రామాలే అభిమతం:
తెలంగాణ పల్లెలు దేశంలో కెల్లా ఆదర్శ గ్రామాలుగా మారాలన్నదే తన అభిమతమని సీఎం వెల్లడించారు. ప్రజల విస్తృత భాగస్వామ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నాయకత్వంలో పల్లెలు బాగు పడాలని ఆకాంక్షించారు. దీనికి అవసరమైన ఆర్థిక ప్రేరణను ప్రభుత్వం అందిస్తుందని, మంచి విధానం తీసుకొస్తుందని చెప్పారు. గ్రామ స్థాయిలో ప్రజలు సమైక్యంగా ఉండి, గ్రామాలను బాగు చేసుకోవాలని, నిధులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి: మద్యం టెండర్లకు భలే గిరాకీ..