ఉమ్మడి జలాశయాల విషయంలో తెలంగాణ నిబంధనలు ఉల్లంఘిస్తోందంటూ ప్రధాని మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి లేఖ రాశారు. ఉమ్మడి జలాశయాల విషయంలో తెలంగాణ తీరుపై ఈనెల ఒకటో తేదీన లేఖ రాశానని గుర్తు చేశారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదని... తెలంగాణ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ఫలితంగా చట్టపరంగా ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన వాటా కోల్పోతున్నామని..నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని తెలిపారు.
ఏకపక్షంగా జలవిద్యుదుత్పత్తి
శ్రీశైలం జలాశయంలో 834 అడుగులకు తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం... అక్కడ జల విద్యుదుత్పత్తి చేస్తోందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. శ్రీశైలం జలాశయానికి జూన్ 1వ తేదీ నుంచి 26 టీఎంసీల్లో 19 టీఎంసీలను విద్యుదుత్పత్తికి వినియోగించారని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ మొండి వైఖరి వల్ల శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు చేరుకోవడం చాలా కష్టంగా మారిందన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌పై ఆధారపడిన పథకాల కోసం 6 వేల క్యూసెక్కుల నీరు తీసుకోవాలంటే... 854 అడుగుల నీటిమట్టం అవసరమన్నారు. అదే 44 వేల క్యూసెక్కులు తీసుకోవాలంటే 881 అడుగుల నీటిమట్టం ఉండాలని.. ఇలా జరగకపోతే.. ఏపీలోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు.. చెన్నై నగరం కరవు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. కృష్ణా బోర్డు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా... నిబంధనలు ఉల్లంఘిస్తూ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుంచి కూడా ఏకపక్షంగా జల విద్యుదుత్పత్తి కొనసాగిస్తోందని ప్రధానికి రాసిన లేఖలో సీఎం జగన్ తెలిపారు.
ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి..
ప్రస్తుత కృష్ణా డెల్టా వ్యవస్థను స్థిరీకరించడానికి ఉద్దేశించిన పులిచింతల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తోందని ఫలితంగా ప్రకాశం బ్యారేజీకి వచ్చేనీరు సముద్రం పాలవుతుందని తెలిపారు. నీటిపారుదల అవసరం లేనప్పుడు విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే విచక్షణారహితంగా నీటిని వినియోగించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని ప్రధానికి తెలిపారు.
నీటి వాటాను కోల్పోతున్నాం..
తెలంగాణ నీటి వినియోగంపై....ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేశామని ప్రధాని దృష్టికి తెచ్చారు. తెలంగాణ చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్ తన నీటి వాటాను కోల్పోవాల్సి రావడం బాధకరమన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా తెలంగాణ రాష్ట్రం అనధికార ప్రాజెక్టులు చేపట్టిందని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ అక్రమ ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్‌కు పదే పదే ఫిర్యాదు చేసినా.. ఇప్పటివరకు చర్యలు లేవని అన్నారు. బోర్డు తన విధులను నిర్వర్తించడంలో సమర్థవంతంగా పనిచేయలేదన్నారు. ఏపీ ప్రయోజనాల పరిరక్షణలో ఆశించిన రీతిలో పనిచేయడం లేదన్నారు.
రక్షణ కల్పించేలా ఆదేశించండి..
ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుగంగ, ఎస్సార్బీసీ, జీఎన్ఎస్ఎస్ సహా చెన్నై నగరానికి నీటిని తరలించడానికి రాయలసీమ ఎత్తిపోతల ఒక్కటే మార్గమని ప్రధానికి రాసిన లేఖలో జగన్ తెలిపారు. రాయలసీమ పథకం కింద కొత్త ఆయకట్టు లేదా కొత్త కాలువ లేదా కొత్త నిల్వలు లేవని స్పష్టం చేశారు. ఉమ్మడి ప్రాజెక్టులపై కేఆర్ఎంబీతో పాటు సీఐఎస్ఎఫ్ రక్షణ కల్పించేలా ఆదేశించాలని ప్రధాని మోదీని లేఖలో కోరారు.
ఇదీ చదవండి: REVANTH REDDY: పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి