ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్.. నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా వద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన మొదటి కాంక్రీట్ పనుల ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొంటారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒకేచోట సౌర, పవన, జల విద్యుత్ ఉత్పత్తికి గ్రీన్-కో సంస్థ అడుగులు వేస్తోంది. 3వేల మెగావాట్ల సౌర విద్యుత్, 550 మెగావాట్ల పవన విద్యుత్‌తో పాటు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ద్వారా 1,680 మెగావాట్లు కలిపి.. మొత్తం 5,230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు.
సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి గుమ్మటం తండా వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టు.. గ్రీన్-కోకు చేరుకుంటారు. ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టు పరిశీలన అనంతరం తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.
ఐఆర్‌ఈపీ(IREP)కి గత ప్రభుత్వ హయాంలో బీజం పడింది. గ్రీన్-కో సంస్థకు ఆమోదం తెలపడంతో ప్రజాభిప్రాయ సేకరణ వరకు పూర్తయింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో ఏడాది జాప్యమైంది. ఆ తర్వాత 2020లో కొత్త ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది.
ఇదీ చదవండి..:
Video Viral: ముఖ్యమంత్రిపై మహిళ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్