తమిళనాడు తరహాలో ఏపీలోనూ పశువుల వైద్యానికి ప్రత్యేక ఆంబులెన్సులు ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున మంజూరు చేసే ప్రతిపాదనకు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. మారుమూల గ్రామాల్లో జబ్బు పడే పశువులను వీటి ద్వారా ఆసుపత్రికి తరలిస్తారు. పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖలపై క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షించారు.
కడక్‌నాథ్ కోడి మాంసానికి మార్కెట్‌లో ఉన్న డిమాండ్ దృష్ట్యా... కడప జిల్లా ఊటుకూరులో మూతపడిన పౌల్ట్రీ ఫారమ్‌ను పునరుద్ధరించాలనే ప్రతిపాదనకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. వైఎస్సార్ పశు పరిహారం పథకం కింద... ప్రతి మూడు నెలలకోసారి చెల్లింపులు పూర్తి చేయాలని, ప్రస్తుత బకాయిలు రూ.98 కోట్లు వెంటనే చెల్లించాలని ఆదేశించారు. పశు పరిహార పథకం వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో(ఆర్‌బీకే) ప్రదర్శించాలని ఆదేశించారు.
రైతు భరోసా కేంద్రాల్లో పశువైద్య సేవలు
ప్రతి పశువైద్యుడు తప్పనిసరిగా... నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రైతు భరోసా కేంద్రాల్లో సేవలందించాలని ఏపీ సీఎం స్పష్టంచేశారు. ఏపీ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పశువైద్యులు, 6,099 పశుసంవర్థక సహాయకులతోపాటు మత్స్యశాఖ సహాయకుల ఖాళీలను భర్తీ చేయాలన్నారు. వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ ల్యాబ్స్‌కు సంబంధించిన భవనాలన్నీ జూన్ 1 నాటికి సిద్ధం కావాలని సూచించారు. కొత్తగా 21 ల్యాబ్ టెక్నీషియన్స్, 21 ల్యాబ్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. వ్యవసాయ,ఉద్యాన, పశుసంవర్ధక విభాగాలన్నింటికీ ఒకే కాల్‌సెంటర్, ఒకే నంబరు ఉండాలని చెప్పారు. మూడేళ్లలో అన్ని పశువైద్యశాలలను నాడు-నేడు కింద ఆధునికీకరించాలని సూచించారు.
నాణ్యంగా లేకుంటే అధికారులదే బాధ్యత
‘ఆర్‌బీకేల్లోని కియోస్క్‌ల ద్వారా పశువుల దాణా, మందులు సరఫరా చేయాలి, విత్తనం, దాణా, వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలి. వైఎస్సార్ చేయూత కింద అందించే పశువులకు ట్యాగ్ చేయించాలి’ అని ముఖ్యమంత్రి జగన్ నిర్దేశించారు. ‘గ్యారంటీ, టెస్టెడ్, క్వాలిటీ అనే ప్రభుత్వ ముద్ర వేసి విత్తనాలు ఇస్తున్నాం. నాణ్యంగా లేకుంటే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. బయో పెస్టిసైడ్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి.’ అని స్పష్టంచేశారు.
కేజ్ కల్చర్‌పై ప్రత్యేక దృష్టి
జలాశయాల్లో కేజ్ కల్చర్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని, దీనిపై జలవనరులశాఖ మంత్రితో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ‘స్థానికంగా మత్స్య ఉత్పత్తుల వినియోగం పెంచేలా మార్కెటింగ్ చర్యలను వేగవంతం చేయాలి. ఈ రంగంలో మందుల కల్తీ లేకుండా చర్యలు తీసుకోవాలి. యాంటీబయోటిక్స్ వాడకం తగ్గాలి’ అని నిర్దేశించారు. ఫేజ్-1 కింద జువ్వలదిన్నె, ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నంలో చేపల రేవుల పనులను వెంటనే మొదలు పెట్టాలని సీఎం ఆదేశించారు. ఫేజ్-2 కింద బుడగట్లపాలెం, కొత్తపట్నం, బియ్యపుతిప్ప, పూడిమడక, మంచినీళ్లపేటల్లో కొత్త రేవుల నిర్మాణానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
గుంటూరు, పశ్చిమ గోదావరిలోకి అమూల్
వచ్చే వారం నుంచి గుంటూరు జిల్లాలో అమూల్ పాల వెల్లువ కార్యక్రమం మొదలవుతుందని అధికారులు సీఎంకు వివరించారు. ఏప్రిల్ నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోనూ ప్రారంభిస్తామని తెలిపారు. చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో అమలు తీరుపై వివరాలను అందించారు. సమావేశంలో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, ఏపీ మత్స్య విశ్వవిద్యాలయ ఏర్పాటుపై చర్చించారు. వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి డాక్టరు సీదిరి అప్పలరాజు, వ్యవసాయ, పశుసంవర్థకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఏపీడీడీసీఎఫ్ ఎండీ బాబు, మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్ తదితరులు హాజరయ్యారు.
ఇదీ చదవండి: జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో అపశ్రుతి