CM Jagan On Paddy Crop: బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలని ఏపీ సీఎం జగన్.. అధికారులను ఆదేశించారు. మంత్రులు కన్నబాబు, అప్పలరాజు, ఉన్నతాధికారులతో కలిసి వ్యవసాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. మిల్లెట్స్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కల్తీ.. విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అమ్మితే కఠిన తప్పవన్న సీఎం.. కల్తీ రాయుళ్లకు రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జైలు శిక్షపై చట్టంలో మార్పులు అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తామని తెలిపారు.
ఆర్‌బీకేలను నిర్వీర్యం చేసేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు బాధ్యులైన వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం సహా కేసులు పెడతామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడే వ్యాపారులపైనా కఠిన చర్యలు తప్పవన్నారు. రైతులకు ఎక్కడా విత్తనాలు అందలేదనే మాట రాకూడదన్న సీఎం.. డిమాండ్ మేరకు విత్తనాలు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు.
కేసీఆర్ బాటలో జగన్..?
Telangana CM KCR On Paddy Purchase: వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. బాయిల్డ్ రైస్ తీసుకోబోమన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ధాన్యం సేకరణలో కేంద్రం వైఖరికి నిరసనగా ఆయన ఇప్పటికే ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపట్టారు. హస్తిన వెళ్లి కేంద్ర మంత్రులను కూడా కలిశారు.
పారాబాయిల్డ్ బియ్యాన్ని కొనుగోలు చేయలేమని కేంద్రం, భారత ఆహార సంస్థ (FCI) చెబుతున్న నేపథ్యంలో తెలంగాణలో యాసంగిలో సాగయ్యే వరిధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. యాసంగిలో వరి వేయవద్దని రైతులకు సూచించిన కేసీఆర్.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవని స్పష్టం చేశారు. సొంతంగా అమ్ముకునే రైతులు యాసంగిలో వరి వేసుకోవచ్చన్నారు. మొత్తం ధాన్యం సేకరణ, నిల్వ శక్తి రాష్ట్రానికి లేదన్నారు. కేసీఆర్ నిర్ణయంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులతో పాటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
తాజాగా.. బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్న ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది. జగన్ కూడా కేసీఆర్ బాటలో కేంద్రంపై పోరుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వరికి బదులు పత్యామ్మాయ పంటలు వేయాలన్న సీఎం జగన్ నిర్ణయంతో వరి పండించే రైతులు అయోమయానికి గురవుతున్నారు.
ఇదీచూడండి: