ఏపీలోని విజయవాడ గొల్లపూడిలో 'దిశ యాప్'పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. మహిళా పోలీసు, వాలంటీర్ల ద్వారా యాప్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. యాప్ వల్ల కలిగే లాభాలు, ఎలా వినియోగించాలో తెలియజేయాలని సీఎం జగన్.. వాలంటీర్లకు సూచించారు. ప్రతి మహిళా తన సెల్ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వెల్లడించారు.
అత్యాచార ఘటనపై స్పందన..
ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన అత్యాచార ఘటన కలచివేసిందన్న.. జగన్.. ఈ తరహా ఆకృత్యాలు నివారించేందుకే దిశ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు.
ఈ యాప్ ఇప్పటికే 4 అవార్డులు గెలిచిందన్నారు. ఇప్పటివరకు 17 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. కోటి మంది మహిళలు దిశ యాప్ డౌన్లోడ్ చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. దిశ యాప్ ఉన్న మహిళ ఎక్కడికెెళ్లినా.. అన్నయ్య తోడుగా ఉన్నట్లేనన్నారు. ఎస్‌వోఎస్ బటన్ నొక్కిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి వస్తారని.. ఆపద సమయంలో ఫోన్ చేయలేకపోయినవారు.. ఫోన్‌ను ఊపినా పోలీసులకు సమాచారం వెళ్తుందని చెప్పారు. మహిళల భద్రత కోసం 900 మొబైల్ పెట్రోల్ వాహనాలను ప్రారంభించినట్లు తెలిపిన సీఎం.. మరో వారం రోజుల్లో వాహనాల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ప్రయాణం సమయంలో మహిళలకు ఏదైనా అనుమానం వస్తే.. యాప్ ద్వారా 'ట్రాక్ మై ట్రావెల్' బటన్ నొక్కవచ్చన్నారు. ప్రయాణ మార్గం సెల్ఫోన్లో చూపడం సహా వాహనం ఆ మార్గంలో వెళ్లకపోతే అలర్ట్ చేసే అవకాశం యాప్‌లో ఉందన్నారు. వాహనం దారి మళ్లించినపుడు బటన్ నొక్కితే వెంటనే పోలీసులు వచ్చి రక్షిస్తారని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఇదీచూడండి: Disha app: ఏపీలో దిశ యాప్‌పై ప్రచారానికి సిద్ధమైన ప్రభుత్వం