ఏపీలో అక్టోబర్ 15 నుంచి కళాశాలలు తెరవాలని విద్యాశాఖను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. సెప్టెంబరులో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్‌ను 90 శాతానికి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. మూడు, నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో 10 నెలలపాటు అప్రెంటిస్‌షిప్‌ను కల్పించాలని చెప్పారు. ఆపై మరో ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన కోర్సులు బోధించాలని దిశానిర్దేశం చేశారు. విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి సీఎం జగన్ అనుమతినిచ్చారు. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో విశ్వవిద్యాలయాలు త్వరితగతిన ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం ఆదేశించారు.