ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఏరియల్ సర్వే చేపట్టారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో సీఎం సర్వే నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను వీహంగ వీక్షణం ద్వారా మంత్రులు సుచరిత, కొడాలి నాని, సీఎస్ నీలం సాహ్నితో కలిసి పరిశీలించారు. వరదల వల్ల వచ్చిన నష్టాలను, తీవ్రతను అంచనా వేశారు.
వర్షాల కారణంగా రాష్ట్రంలో 71 వేల 800 హెక్టార్లలోని పంట నష్టపోయినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. విద్యుత్, రహదారుల వ్యవస్థలు ధ్వంసమైనట్లు తేల్చారు. దాదాపు రూ.4,450 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తూ...ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి ఇప్పటికే లేఖ రాశారు. తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాలని హోంశాఖను కోరిన విషయం తెలిసిందే.
వరద ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలను ఉచితంగా సరఫరా చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
ఇదీచదవండి: వరద బాధితులను పరామర్శించినందుకే నాపై విమర్శలు: లోకేశ్