ఆంధ్రప్రదేశ్లో భారీవర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే (CM Jagan Aerial survey) నిర్వహించారు. ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి కడప చేరుకున్న ముఖ్యమంత్రి.. అక్కడ నుంచి హెలికాఫ్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు చేపట్టాల్సిందిగా సీఎం ఆదేశాలిచ్చారు. చిత్తూరు, తిరుమలలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు త్వరితగతిన రూ. 2 వేల ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు.
వర్షాలకు 21మంది మృతి..
రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు(Heavy rains in andhra pradesh) పలు జిల్లాల్లో చాలామంది వరదల్లో చిక్కుకుని ప్రాణాలు (people died due to heavy rains) కోల్పోయారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చిత్తూరు, కడప జిల్లాల్లోని విద్యా సంస్థలకు అధికారులు నేడు సెలవు(Holiday to schools) ప్రకటించారు.
కడప జిల్లా రాజంపేట వరదల్లో మొత్తం 30 మంది గల్లంతయ్యారు. రాజంపేట మండలం రామాపురంలో వరదనీటిలో 3 ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. ఈ ఘటనలో 12మంది మృతి చెందారు. వారి మృతదేహాలను సిబ్బంది.. గుండ్లూరు శివాలయం వద్ద 7 మృతదేహాలు, నందలూరు ఆర్టీసీ బస్సులో 3 మృతదేహాలు, రాజంపేటలోని మందపల్లి వద్ద 2 మృతదేహాలను గుర్తించారు. రాజంపేట వరదల్లో ఇప్పటివరకు 12 మంది మృతి చెందారు. శుక్రవారం ఉదయం నందలూరు వద్ద మూడు ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కుకున్నాయి. బస్సుల్లో చిక్కుకున్న పలువురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.
శిథిలాల కింద చిక్కి
చిత్తూరు జిల్లా పెరుమాళ్ల కండ్రిగలో వరద ప్రవాహంలో నిన్న ఓ వ్యక్తి మృతి చెందాడు. సుబ్బయ్య(75) అనే వ్యక్తి వాగు దాటే క్రమంలో వరద ప్రవాహానికి వాగులో కొట్టుకుపోయాడు. అనంతపురం జిల్లా రామగిరి మండలం గంతిమర్రిలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలిన ఘటనలో రంజిత్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కదిరి పాత ఛైర్మన్ వీధిలో నిర్మాణంలో ఉన్న రెండు భవనాలు(floods in andhrapradesh) కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో మరో ఇద్దరు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న 10 మందిని సురక్షితంగా బయటకు తీశారు. ఇంకా ఇద్దరిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవనం కూలే సమయంలోనే గ్యాస్ సిలిండర్ పేలినట్లు బాధితులు పేర్కొన్నారు. ఓ భవనం కూలి.. పక్కనున్న మరో భవనంపై పడింది. దీంతో ఆ భవనం కూడా నేలమట్టమైంది.
ఓ ఇంట్లో 8 మంది, మరో ఇంట్లో ఉన్న ఏడుగురు (మొత్తం15 మంది) శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం మేరకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. ఇప్పటివరకు 10 మంది బాధితులను సురక్షితంగా బయటకు తీశారు. శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అదనపు ఎస్పీ రామకృష్ణప్రసాద్, ఆర్డీవో వెంకటరెడ్డి.. ఘటనాస్థలిని పరిశీలిస్తున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం శ్రీరంగరాజపురంలో ఓ రైతు మృతి చెందాడు. పొలం వద్ద వరద నీటిలో చిక్కుకున్న బుచ్చయ్య.. ఒక్కసారిగా వరద చుట్టుముట్టడంతో నీటిలో మునిగిపోయాడు.
ఇదీ చదవండి: Live video: వరదలో కొట్టుకుపోయిన రెండంతస్తుల భవనం