కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చుతూ... ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరోనాతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... బాధితులకు ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్సిజన్, మందులు కొరత ఉన్నట్లు ఆయన ఆరోపించారు.
కరోనా బాధితులకు సంజీవని లాంటి రెమ్‌డెసివర్ మెడిసిన్ కొరత తీవ్రంగా వేధిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడంతో పాటు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న రెమ్‌డెసివర్ ఇంజిక్షన్‌పై తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకొని... తక్కువ ధరకే కరోనా బాధితులకు అందించాలని డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం మాట్లాడుతూ... ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలను నియంత్రించేందుకు కమిటీ వేస్తున్నట్లు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ కమిటీ ప్రతి ఆస్పత్రిని సందర్శించి పర్యవేక్షణ చేయాలని భట్టి కోరారు.