సీఎంను తిడితే కేసులు పెడతామని హెచ్చరిస్తోన్న మంత్రి కేటీఆర్.. అసలు తిట్ల సంస్కారం తీసుకొచ్చిందే కేసీఆర్ అన్న విషయం మరచిపోతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గుర్తు చేశారు. ఎన్నికలు.. అధికార పార్టీకి వ్యాపారంలా మారిపోయాయని ఆరోపించారు. తెరాసకు.. ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి, నాయకులను కొనుగోలు చేయడం మామూలై పోయిందన్నారు. కాంగ్రెస్ వల్లే.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్న విషయం కేటీఆర్కు గుర్తు లేదా అని ఆయన ప్రశ్నించారు.
జానారెడ్డి పార్టీ మారుతున్నారంటూ.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సీఎల్పీ నేత ఖండించారు. ఇది భాజపా దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. దుబ్బాక ఎన్నికల సమయంలోనూ.. కాంగ్రెస్ అభ్యర్థి తెరాసలో చేరుతున్నాడంటూ వీడియో విడుదల చేసి, ఓటర్లను తప్పుదోవ పట్టించినట్లు గుర్తు చేశారు. సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవలందిస్తోన్న వ్యక్తిపై బండి చేసిన వ్యాఖ్యలు.. అత్యంత చౌకబారుగా ఉన్నాయన్నారు. జానారెడ్డి గురించి తెలిసిన ఏ ఒక్కరూ.. బండి మాటలను విశ్వసించరని అన్నారు.
ఇదీ చదవండి: సాగర్ ప్రచారంలో మంత్రిని నిలదీసిన ప్రైవేట్ టీచర్