Rotary Award For CJI NV RAMANA: తెలుగువాడి గౌరవాన్ని మరింత పెంచుతానని మాట ఇస్తున్నానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. విజయవాడ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. అవార్డు అందుకున్న జస్టిస్ ఎన్వీ రమణ.. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. తాను సాధించాల్సింది చాలా ఉందని ఈ అవార్డు గుర్తు చేసినట్టుగా భావిస్తున్నాని అన్నారు. రోటరీ క్లబ్‌కు ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్న సీజేఐ.. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని కితాబిచ్చారు.
కోర్టులో భాష ప్రజలకు అర్థమవ్వాలి..
ఇటీవల రాజ్యాంగంపై చాలా చర్చ జరుగుతోందన్న సీజేఐ.. ఇది శుభపరిణామం అని అన్నారు. రాజ్యాంగంలోని హక్కులు, బాధ్యతతో పాటు రూల్ ఆఫ్ లా గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరముందని అన్నారు. రాజ్యాంగానికి సంబంధించిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. హక్కులకు భంగం కలిగినప్పుడు తప్పనిసరిగా కోర్టులను ఆశ్రయించాలని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. అయితే.. కోర్టులో అర్థంకాని భాష మాట్లాడితే ప్రజలు ఇష్టం చూపరని అన్నారు. న్యాయస్థానంలో జరిగే వాదనలు ప్రజలకు అర్థంకాకపోతే.. అవన్నీ వ్యర్థమేనని అన్నారు. అందువల్ల కోర్టుకు వచ్చే సామాన్యుడికి తన కేసు గురించి అర్థమయ్యేలా చూడాలని అభిలాషించారు.
న్యాయవ్యవస్థలో మౌలిక వసతులు పెరగాలి..
న్యాయవ్యవస్థ కొన్ని ప్రాథమిక సమస్యలను ఎదుర్కొంటోందని ఈ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థలో మౌలిక వసతులు పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే.. ఈ మౌలిక వసతుల కల్పన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. దేశంలో 4.6 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్న సీజేఐ.. ఏళ్లతరబడి కేసులు పెండింగ్‌లో ఉండకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. 3 వ్యవస్థలూ సరిగా పనిచేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని తేల్చి చెప్పారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా.. వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నానని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. జడ్జిల భర్తీ, ఇతర సంస్కరణలు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.
మాతృభాషను మరవొద్దు..
మన ఎదుగుదలకు, పునాదికి మాతృభాషే కీలకమని సీజేఐ అన్నారు. ఎన్ని భాషలు వచ్చినా.. ఆలోచనాత్మక ధోరణి మాతృభాషతోనే సాధ్యమని స్పష్టం చేశారు. తెలుగు సంస్కృతి, సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని సూచించారు.
"రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరికీ అందాలి. ఆ హక్కులు లైబ్రరీలు, సభలకు పరిమితం కాకూడదు. హక్కులపై అట్టడుగు ప్రజలకు కూడా అవగాహన కల్పించాలి. రూల్ ఆఫ్ లా లేకుంటే అరాచకం పెరుగుతుంది. అరాచకం పెరిగితే ప్రజాస్వామ్యానికి ముప్పు. కోర్టు అంశాలు అర్థంకాని బ్రహ్మపదార్థంలా మిగిలిపోకూడదు. కోర్టుకు వచ్చే సామాన్యుడికి తన కేసు గురించి అర్థం కావాలి. దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థలో మౌలిక వసతులు పెరగాలి. న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కల్పన బాధ్యత ప్రభుత్వాలదే. న్యాయవ్యవస్థ కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటోంది. న్యాయవ్యవస్థ భారతీయీకరణ జరగాలి. దేశంలో 4.6 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 3 వ్యవస్థలూ సరిగా పనిచేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. సీజేఐగా వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నా. జడ్జిల భర్తీ, ఇతర సంస్కరణలు తెచ్చేందుకు కృషి చేస్తున్నా. మన ఎదుగుదలకు, పునాదికి మాతృభాషే కీలకం. ఎన్ని భాషలు వచ్చినా ఆలోచనాత్మక ధోరణి మాతృభాషతోనే సాధ్యం. తెలుగు సంస్కృతి, సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలి."
- జస్టిస్ ఎన్వీ రమణ, సీజేఐ
ఇవీ చూడండి: