CJI NV Ramana about books: తాను జీవితంలో పైకి రావడానికి గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడిందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. 34వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన సీజేఐ.. చదువుకునే రోజులను గుర్తుచేసుకున్నారు. ఇంటినే గ్రంథాలయంగా మార్చిన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకికి చెందిన కూరెళ్ల విఠాలాచార్యను సన్మానించారు. గతంలో హస్తభూషణంగా పుస్తకం ఉంటే.. ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతులో సెల్‌ఫోనే ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తక ప్రదర్శనశాలకు యువతరం రావడం చూసి.. తిరిగి ఆశలు చిగురించాయన్నారు. పుస్తకం సజీవంగా ఉంటుందనే నమ్మకం కలిగిందన్నారు. ప్రస్తుతం పాఠశాలలు లైబ్రరీ, గ్రౌండ్ నిబంధనలు పాటించట్లేదన్న సీజేఐ.. ప్రభుత్వమే ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పులను తెలుగుతో పాటు.. అన్ని భాషల్లోకి అనువాదాలు చేసి వెబ్సైట్లో పెడుతున్నామని.. అది మంచి ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నామన్నారు.
తెలుగు భాష, సంస్కృతిని గౌరవించాలి..
డిజిటల్ యుగంలో పుస్తకం చదివే పనిలేకుండా పోయిందని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. పుస్తకం ఎవరో చదివితే వినే పరిస్థితి ప్రమాదకర ధోరణికి నిదర్శనమన్నారు. పుస్తకం, పేపర్ చదివితే మెదడులో ముద్రపడిపోతుందని.. ఎవరో చదివితే అప్పటివరకే గుర్తుంటుంది తప్ప అర్థం కాదన్నారు. పుస్తకం చదవడం గొప్ప అభ్యాసం... అవసరం కూడా అని వివరించారు. వ్యాయామం, పుస్తక పఠనం జీవితంలో ఎంతో మార్పు తెస్తాయన్నారు. ప్రపంచ గతిని మార్చిన సాహిత్యాన్ని పిల్లలకు చిన్నతనం నుంచే పరిచయం చేయాలన్నారు. లేఖలు రాసే సంస్కృతి పూర్తిగా కనుమరుగైపోయిందని సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషను, సంస్కృతిని గౌరవించాలని సీజేఐ కోరారు.
పుస్తకాలు బహుమతివ్వండి..
"పది రోజులుగా పుస్తకాల పండగ కొనసాగింది. గతంలో కోఠిలో ఉన్న విశాలాంధ్ర, నవోదయ పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు అన్ని ప్రచురణ సంస్థల నుంచి పుస్తకాలను ఉంచడం సంతోషం. రాబోయే రోజుల్లో 'పుస్తకం' మనుగడ సాధిస్తుందా..? అన్న సందిగ్ధ సమయంలో అనేక మంది యువతరం రావడం చూస్తే మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. మా పాఠశాల గ్రంథాలయం నాకు చాలా ఉపయోగపడింది. ఇవాళ అటువంటి పరిస్థితులు లేకపోవడం దురదృష్టకరం. ఆట స్థలం, గ్రంథాలయం ప్రతి పాఠశాలలో ఉండాలి. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. వాటితోనే పిల్లల్లో క్రీడాస్ఫూర్తి వస్తుంది. పుస్తకం చదవడం... జ్ఞానాన్ని పెంచుతుంది. అమ్మ నవల ప్రభావం నాపై చాలా ఉంది. సాహిత్యం, కవులు రాసిన పుస్తకాలు చాలా ముఖ్యం. లేఖలు రాయడం యువతరం పూర్తిగా మర్చిపోయింది. డిజిటల్ యుగంలోకి వెళ్లిపోయారు. భావవ్యక్తీకరణ, విజ్ఞానం పుస్తకాలతోనే అలవడుతుంది. డిజిటల్ మీడియాలో సినిమా సమీక్షలు మాత్రమే వస్తున్నాయి. చాలా మంది ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు తమ జీవితాలను త్యాగం చేశారు. అటువంటి వారి గురించి చదువుకోవాలి. మహా ప్రస్థానం రాసిన తర్వాతనే శ్రీశ్రీ వెలుగులోకి వచ్చారు. కాఫీ కన్నా పుస్తకాలు ఎక్కువ కిక్ ఇస్తాయి. చదవండి.. చదివించండి... సాహిత్యాన్ని పెంచే పుస్తకాలు చదవండి. బొకేలు, షాల్స్ ఇవ్వడం మాని పుస్తకాలు బహుమతులుగా ఇవ్వండి. గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపాలి. నిధులు మంజూరు చేయాలి. ప్రజలు నమ్ముతారనే విశ్వాసం కలిగితే పుస్తకం రాస్తాను." -జస్టిస్ ఎన్వీ రమణ, సీజేఐ
తెలంగాణ సాధించింది.. పుస్తకాలు చదివే..!
"2014 నుంచి ప్రారంభమైన పుస్తక ప్రదర్శన... కవులు, కళాకారులకు వేదికగా మారుతోంది. డిజిటల్ యుగంలో విద్యార్థుల నుంచి...పెద్దవాళ్ల వరకు పుస్తకాలను కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ సాధించింది కూడా ఈ పుస్తకాలను చదివే. పుస్తక పఠనం పట్ల పిల్లలకు ఆసక్తి కల్పించాలి. ఇతిహాసం, పురాణాలు, చరిత్ర ఇవన్నీ పుస్తకాలు చదవడంతోనే తెలుసుకోగలుగుతాం. సీజేఐ ఎన్వీ రమణను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి." - శ్రీనివాస్ గౌడ్, మంత్రి