CJI Justice NV Ramana Tirupati Tour సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల తిరుపతిలో పర్యటిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామునే శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్రీయ సేవా సమితి మాజీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత గుత్తా మునిరత్నం మునిరత్నం విగ్రహాన్ని సీజేఐ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం తర్వాత మహాత్మా గాంధీ జీవిత చరిత్ర సత్యశోధ పుస్తకావిష్కరణ కార్యక్రానికి హాజరయ్యారు. పుస్తకావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘నిజాయతీగా జీవితాన్ని ఎలా గడపాలో గాంధీ నేర్పారు. చెడును ప్రేమతో ఎదుర్కోవడం ఎంతో సాహసోపేతం’’ అని అన్నారు. ‘‘మహాత్మా గాంధీజీ రెండుసార్లు తిరుపతికి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. 1921లో మొదటిసారి, 1933లో రెండోసారి ఆయన తిరుపతికి వచ్చారు’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తితిదే ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘‘ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయి. చాలావరకు హింసాపూరిత వాతావరణంలోనే సాగాయి. అహింస అనే ఆయుధంతో గాంధీజీ పోరాడిన విషయం తెలిసిందే. సత్యశోధన పుస్తకం ద్వారా గాంధీని మరోసారి గుర్తు చేసుకుంటున్నాం. గాంధీ జీవన సందేశాన్ని అందుబాటులోకి తీసుకురావడం ప్రశంసనీయం’’ అని సీజేఐ తెలిపారు. - సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి నాకు ఆప్తమిత్రుడు, ఆపూర్వ సహోదరుడు. ఆయన్ను పార్టీలు సరిగా ఉపయోగించుకోలేదు. తెలుగు భాష, సంస్కృతి పట్ల ఆయనకు మక్కువ ఎక్కువ. చాలా ముక్కుసూటిగా వ్యవహరిస్తారు
- సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
తిరుమల శ్రీవారి సేవలో సీజేఐ.. తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం సీజేఐ కుటుంబం శ్రీవారిని దర్శించుకుంది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కూడా కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
తిరుచానూరు: తిరుచానూరులో చేరుకున్నసీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం పద్మావతి అమ్మవారిని సీజేఐ దర్శించుకున్నారు. సీజేఐకి ఈవో ధర్మారెడ్డి... అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందించారు. ఆస్థాన మండపంలో సీజేఐ ఎన్వీ రమణకు వేద పండితులు ఆశీర్వచనం పలికారు.
రాష్ట్రీయ సేవా సమితి మాజీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత గుత్తా మునిరత్నం మునిరత్నం విగ్రహాన్ని సీజేఐ ఆవిష్కరించారు. ఎన్జీరంగా, వినోబా భావే వంటివారి ఆశయాలకు అనుగుణంగా పనిచేశారని సీజేఐ గుర్తు చేశారు. మహిళలు, రైతులకు రాస్ సంస్థ ద్వారా సేవలందాయని తెలిపారు. రాస్ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆకాంక్షించారు.