CJI Justice NV Ramana: ఎన్ని సముద్రాల అవతల ఉన్నా.. మాతృ భాషను, సంస్కృతిని, కన్నతల్లిని ఎప్పుడూ గుర్తుచేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. తెలుగు కమ్యూనిటీ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు పాల్గొన్నారు. సొంత ఊరిని, మనుషులను వదులుకుని వచ్చి ఉంటున్నా.. అవకాశం ఉన్నప్పుడు మాతృభూమిని సందర్శించాలని సూచించారు. సాంస్కృతిక సంస్థల ప్రోత్సాహానికి కృషిచేయాలని కోరారు. మాతృ భాష, సంస్కృతిని కాపాడుకోవాలన్నారు. ఈ సందర్భంగా.. తెలుగు భాష పట్ల తనకున్న గౌరవాన్ని ఎలా నిరూపించుకున్నారన్న విషయాన్ని.. సుప్రీంకోర్టులో జరిగిన ఓ సంఘటన ద్వారా వివరించారు.
"సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు నా బంగ్లాలో నేమ్‌ప్లేట్ హిందీ, ఆంగ్లంలో పెట్టారు. నేమ్‌ప్లేట్ తెలుగులో కావాలని కోరితే లేదన్నారు. నాకు తెలుగులోనే కావాలని పట్టుబట్టి నేమ్‌ప్లేట్ తెలుగులో పెట్టించా. నా మాతృభాష విషయంలో రాజీపడనని గట్టిగా చెప్పా. నా ఇంటి ఇన్‌గేట్, ఔట్‌గేట్‌లోనూ ఆంగ్లంతో పాటు తెలుగులో నేమ్‌ప్లేట్ ఉంటుంది. భాషను, సంస్కృతిని, కన్నతల్లిని ఎప్పుడూ గుర్తుచేసుకోవాలి. ఇంట్లో మాట్లాడేటప్పుడు మాతృభాషలోనే మాట్లాడాలి. శతక సాహిత్యాలను డౌన్‌లోడ్ చేసుకుని పిల్లలతో పద్యాలు చదివించాలి. ప్రతి ఇంట్లో కూడా ఒక పెద్దబాలశిక్ష పుస్తకం ఉండాలి. ఆంగ్లంతోపాటు తెలుగు నేర్పించాల్సిన అవసరం తప్పనిసరి. పిల్లలు తెలుగులో మాట్లాడేటప్పుడు కొన్ని తప్పులు మాట్లాడతారు. తప్పు మాట్లాడినప్పుడు ఉచ్ఛారణ సరిదిద్దాలి తప్ప కోపగించవద్దు."- జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ఇవీ చూడండి: