ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు, ప్రాజెక్టుల ద్వారా నీటి ఎత్తిపోతలు, జలవిద్యుదుత్పత్తి తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, ఈఎన్సీ మురళీధర్, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు సహా పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. వివిధ అంశాలకు సంబంధించి సమావేశంలో తీర్మానాలు చేశారు. చుక్క నీటి కేటాయింపులు, పర్యావరణ అనుమతుల్లేకుండా, జాతీయ హరిత ట్రైబ్యునల్ స్టే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న చట్టవ్యతిరేక, అక్రమ రాయలసీమ ఎత్తిపోతలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం లేదని సమావేశం తీర్మానించింది. చట్టవ్యతిరేకమైన, అక్రమ ప్రాజెక్టైన పోతిరెడ్డిపాడును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని, ఆ కాల్వకు నీటిని ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల కూడా అక్రమ ప్రాజెక్టేనని తీర్మానించారు.
చెరిసగం వినియోగించుకోవాలి..
నికర కేటాయింపులున్న ప్రాజెక్టులకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను వాడుకోవాలని తీర్మానించిన సమావేశం... తొమ్మిదో తేదీన త్రిసభ్య కమిటీ భేటీని రద్దు చేసి 20 తర్వాత పూర్తి స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును కోరింది. రాష్ట్ర అంశాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం ఎజెండాలో చేర్చాలని, పోతిరెడ్డిపాడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని అనుమతించబోమని,రాయలసీమ ఎత్తిపోతలను వ్యతిరేకిస్తూ వాదనలు వినిపించాలని తీర్మానించింది. ఈ ఏడాది నుంచి ట్రైబ్యునల్ కేటాయింపులు జరిగే వరకు 811 టీఎంసీల నికర జలాల్లో రెండు రాష్ట్రాలు చెరి సగం వినియోగించుకోవాలని తీర్మానించింది.
చట్టబద్ధంగానే జల విద్యుత్ ఉత్పత్తి
మంత్రివర్గ నిర్ణయం మేరకు జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి నీటి లభ్యత ఉన్నంతకాలం పూర్తి స్థాయిలో జలవిద్యుత్ ఉత్పత్తి కొనసాగించాలని సమావేశంలో తీర్మానించారు. జలవిద్యుత్‌కు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందాలు, నిబంధనలు లేవని... ఉత్పత్తిని ఆపమని చెప్పే హక్కు కేఆర్ఎంబీకి లేదన్న సమావేశం, ఈ అంశంలో బోర్డు జోక్యం చేసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేసింది. కృష్ణా జలాలను వృథాగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారన్న ఏపీ ప్రభుత్వ దుష్ప్రచారాన్ని సమావేశం ఖండించింది. పులిచింతల నుంచి విడుదలైన నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా జిల్లా అవసరాలను తీర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్‌కు సూచించింది. తద్వారా పట్టిసీమ నుంచి గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు వినియోగించే విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవాలని సలహా ఇచ్చింది. సాగునీటి కోసం ఎత్తిపోతలతో పాటు హైదరాబాద్ తాగునీటి, మిషన్ భగీరథ అవసరాల కోసం రాష్ట్రానికి విద్యుత్ అవసరం చాలా ఉందన్న సమావేశం... చట్టబద్ధంగానే ప్రభుత్వం జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తోందని స్పష్టం చేసింది.
ఎన్జీటీ ప్రకటించినా ఇంకా మొండిగానే..
బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తితో వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని, 51శాతం క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్న కేంద్ర మార్గదర్శకాలను జల విద్యుత్ ఉత్పత్తితో తెలంగాణ అమలు చేస్తోందని వెల్లడించింది. విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే ప్రత్యేకమైన శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా కేటాయించిన నీటితో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని ఏపీ ప్రభుత్వం ఫిర్యాదులు చేయడం హాస్యాస్పదంగా ఉందని సమావేశం అభిప్రాయపడింది. స్టే ఉల్లంఘిస్తే ఏపీ సీఎస్‌ను జైల్లో వేస్తామని ఎన్జీటీ ప్రకటించింనప్పటికీ.. మొండిగా సర్వేల ముసుగున పోతిరెడ్డిపాడు వద్ద పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడం అన్యాయమని సమావేశం వ్యాఖ్యానించింది. జూరాల కుడి, ఎడమ కాల్వల ద్వారా నీరు వదిలి చెరువులు, కుంటలను నింపాలని నిర్ణయించారు. శ్రీశైలం డ్యామ్ మీద తెలంగాణ భూభాగంలోకి గుర్తింపు కార్డులున్న విద్యుత్ ఉద్యోగులు మినహా ఇతరులు ఎవరినీ అనుమతించవద్దని... అన్ని కృష్టా ప్రాజెక్టుల వద్ద పూర్తిస్థాయి రక్షణ చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
గత పాలకులు ఎత్తిపోతలకు ప్రాధాన్యం ఇవ్వలేదు..
నీటిపారుదల అంశాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అంశాలను ప్రస్తావించారు. సముద్ర మట్టానికి ఎగువనున్న తెలంగాణ చుట్టూ నదులు ప్రవహిస్తున్నా గ్రావిటీ ద్వారా సాగునీరు తీసుకునే పరిస్థితి లేదని ప్రాజెక్టుల ద్వారా నీటిని ఎత్తిపోసుకోవాల్సిన దుస్థితి ఉందన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన వలస పాలకులు ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్న సీఎం... ఇక్కడి వ్యవసాయాన్ని దండుగలా మార్చి, రైతులకు అన్యాయం చేశారని వ్యాఖ్యానించారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇచ్చి కాళేశ్వరం వంటి వాటిని చేపట్టిన ప్రభుత్వం సాగునీటి గోస తీర్చిందన్నారు. అత్యధిక దిగుబడులతో తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా నిలిచిందన్న కేసీఆర్... ఎత్తిపోతల ద్వారా నదీజలాలను తరలించడం ద్వారా మాత్రమే సాధ్యమైందని వివరించారు.
కృష్ణా, గోదావరిలపై మరిన్ని ప్రాజెక్టులు
రాబోయే కాలంలో కృష్ణా, గోదావరి నదులపై మరిన్ని ప్రాజెక్టులను నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ నీటి వాటా కోసం అవసరమైతే కేంద్రంతో పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెండు పంటలకు నీరందాలంటే జలవిద్యుదుత్పత్తి అవసరం. సాగునీరుతో పాటు జలవిద్యుత్ ఉత్పత్తికి సైతం కేటాయింపుల్లో నుంచే నీరు తీసుకుంటున్నామని ఇందులో ఎవరికీ అభ్యంతరానికి ఆస్కారం లేదని కేసీఆర్ అన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు వరదజలాలను మాత్రమే వాడుకుంటామని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి శాసనసభలో, వెలుపలా అనేకమార్లు ప్రకటించారని కేసీఆర్ గుర్తు చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు కూడా అదే విషయాన్ని చెప్పారన్న ఆయన ప్రస్తుతం ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులకు తెరలేపిందని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర తరహాలోనే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు స్నేహ హస్తం అందించామని గుర్తు చేశారు. అయినప్పటికీ వారు పెడచెవిన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: CM KCR TOUR: ముఖ్యమంత్రి రాకకోసం ముస్తాబయిన సిరిసిల్ల