కరోనా టీకాల సరఫరా విషయంలో ఒకే గొంతుక వినిపించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. గ్లోబల్ టెండర్లు పిలిచినా ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదని కేరళ సీఎం పినరయి విజయన్‌కు రాసిన లేఖలో జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రాల్లో వ్యాక్సిన్ లభ్యత విషయంలో ఉన్న ఇబ్బందులను కేంద్ర దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఒకే గొంతుక వినిపించాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రమే పూర్తిగా చేపట్టాలని అందరం కోరదామని లేఖలో పేర్కొన్నారు.
గ్లోబల్ టెండర్ల ఆమోదం కేంద్రం చేతుల్లో ఉందని ప్రస్తావించారు. వ్యాక్సిన్ లభ్యత విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తేలా పరిస్థితి మారుతోందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ సరఫరా విషయంలో రాష్ట్రాలు ఒకరికొకరు సహకారం అందించుకోవాలని జగన్ కోరారు. వ్యాక్సినేషన్ వేగంగా జరగకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ లభ్యత పెంచుకోవడం దేశ తక్షణ అవసరమని లేఖలో వెల్లడించారు. కేంద్రీకృత వ్యాక్సినేషన్ ప్రక్రియ వల్ల దేశానికి ఎక్కువ మేలు జరుగుతుందన్నారు.
ఇదీ చదవండి: KTR: 'హెల్త్‌కేర్ వర్కర్లను దేవునితో సమానంగా చూస్తున్నారు'