నాడు-నేడు పనుల ద్వారా కోట్లాది రూపాయలు వెచ్చించి పాఠశాల భవనాలు నిర్మిస్తున్నా.. విశాఖ మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో విద్యార్థులు చదువుకునేందుకు గూడు కరువైంది. ఏటా కొత్త భవనాలు నిర్మిస్తున్నామని అధికారులు, రాజకీయ నాయకులు చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా.. మా బతుకులు మారవంటూ విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం మొండిగెడ్డ పంచాయతీ చెక్కల మద్దిపాలెం విద్యార్థులు ఘోషిస్తున్నారు. గిరిజన ఉపప్రణాళిక నిధులూ తమకు ఏ మాత్రం ఉపయోగపడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొండలు, గుట్టలు దాటాల్సిందే...
ఈ ప్రాంతంలో సుమారు 28 మంది విద్యార్థులు ఉన్నారు. పంచాయతీ కేంద్రం నుంచి సుమారు తొమ్మిది కిలోమీటర్లు కొండలు, గుట్టలు దాటి చెక్కల మద్దిపాలెం కాలినడకన వెళ్లాలి. ఇక్కడ పాఠశాల భవనం లేదు. ఈ గ్రామానికి ఉపాధ్యాయుడిగా వచ్చిన వ్యక్తి.. తన సొంత నిధులతో పాకను నిర్మించారు. ఇందులోనే విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నారు.
వరుణుడితో పారాటం తప్పదు...
శుక్రవారం ఈ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి విద్యార్థులు పడిన పాట్లు అన్నీఇన్నీ కావు. పాక నుంచి వర్షపు నీరు పడుతున్నా.. పుస్తకాలు తడవకుండా గోనెసంచులు చేతబట్టుకుని విద్యార్థులు పెద్ద పోరాటమే చేశారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు ఈ దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో.. ఇక్కడి పాఠశాల దుస్థితి గురించి చుట్టుపక్కల చర్చ జరుగుతోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి చెక్కలమద్ది పాలెం పాఠశాలకు పక్కా భవనం నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: రుద్రారంలో జపాన్ నైపుణ్య శిక్షణ కేంద్రం