polavaram project : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇంత ఆలస్యానికి ప్రధాన కారణం గుత్తేదారులను మార్చడమే అని హైదరాబాద్ ఐఐటీ నిపుణలు తేల్చారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయిస్తున్నా.. అందులో 30 శాతమే ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ఈ ఖర్చుల ఆడిట్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయకపోవడంతో కేంద్రం నుంచి రీయింబర్స్‌మెంట్‌లో సమస్యలు వస్తున్నాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన వ్యూహం, ప్రణాళిక అమలుకు ఉన్నత స్థాయిలో సరైన అధికారులు లేరని అన్నారు. వివిధ సంస్థల మధ్య సమన్వయం లేదన్న నిపుణులు.. ప్రాజెక్టు నిర్మాణానికి సరిపడా మానవ వనరులను అందించడంలో ఏజెన్సీ విఫలమైందని వెల్లడించారు.
'ప్రాజెక్టు నిర్మాణానికి అవరమైనంత స్థాయిలో యంత్ర సామగ్రినీ సమకూర్చడం లేదు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సూచనలనూ సకాలంలో అమలు చేయట్లేదు. ఈ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేందుకు అవసరమైన ఎంఐఎస్ (మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. ప్రాజెక్టు పురోగతిని కాగితాలపై చేతిరాతతో నమోదు చేసి నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఇలా చేయడంవల్ల మానవ తప్పిదాలను గుర్తించడం కష్టం. 2020లో నిర్వహించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ 13వ అత్యవసర సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ అమలు కాలేదు. ఎడమ కాలువ, పునరావాసం, భూసేకరణ, డిస్ట్రిబ్యూటరీలకు నిధుల లభ్యత వంటి అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించే క్రమంలోనూ లోపాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి నిపుణులు తేల్చిన కారణాలు ఇవీ. అని హైదరాబాద్ ఐఐటీ నిపుణలు తేల్చారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతోంది? పరిష్కార మార్గాలేంటి? ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై మూడో పక్షంతో ప్రాజెక్టు అథారిటీ అధ్యయనం చేయించింది. ఆ బాధ్యతలను హైదరాబాద్ ఐఐటీ నిపుణులకు అప్పజెప్పారు. వారు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి 2021 నవంబరులో పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నివేదిక సమర్పించారు. ఇటీవల రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానం ఇస్తూ పోలవరం ఆలస్యానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కారణమని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. మూడోపక్షం నివేదిక ఆధారంగా తాము ఈ నిర్ధారణకు వచ్చామని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ ఐఐటీ సివిల్ ఇంజినీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ కె.బి.వి.ఎన్.ఫణీంద్ర నేతృత్వంలో మరో నలుగురు నిపుణులు పోలవరం ప్రాజెక్టును పరిశీలించి, క్షేత్ర స్థాయిలో వివిధ అంశాలను అధ్యయనం చేసి ఈ నివేదిక రూపొందించారు.జల వనరుల నిపుణులు అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్ కె.రేగొండ, ఆర్థిక నిపుణులు అసోసియేట్ ప్రొఫెసర్ కె.పి.ప్రభీష్, పునరావాస నిపుణలు అసోసియేట్ ప్రొఫెసర్ శుభ రంగనాథన్, అసోసియేట్ ప్రొఫెసర్ హరిప్రియ నరసింహన్ ఈ బృందంలో మిగిలిన సభ్యులు. మొత్తం 124 పేజీల ఈ నివేదికలో సమగ్రంగా అన్ని అంశాలూ చర్చించారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి ప్రకృతిపరమైన కారణాలతోపాటు, నిర్మాణపరమైన, ఆర్థిక, ఇతరత్రా కారణాలను పేర్కొన్నారు.
‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇంత ఆలస్యం కావడానికి ఒక ప్రధాన కారణం గుత్తేదారును మార్చడం. ప్రధాన డ్యాంతో పాటు కాలువల పనుల్లోనూ గుత్తేదారును మార్చారు. ఎడమ కాలువలో గుత్తేదారులను మార్చడంవల్ల కాంట్రాక్టు వివాదాలు తలెత్తాయి. గుత్తేదారుడిని ముందే తొలగించడం, తొలగిస్తూ ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయి. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తపడాలి’ అని హైదరాబాద్ ఐఐటీ నిపుణలు తేల్చిచెప్పారు.
ఆలస్యానికి కారణాలు ఇవీ.. ఆంధ్రప్రదేశ్ జల వనరులశాఖ కాంట్రాక్టు ఏజెన్సీలను మార్చడం.
* భూసేకరణ, పునరావాసం కార్యక్రమాల్లో ఆలస్యం.
* పోలవరాన్ని నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవడం.
* పోలవరంతో సంబంధం ఉన్న వివిధ సంస్థల మధ్య సమన్వయలేమి.
* ప్రభుత్వం నుంచి సరైన సమయంలో ఆకృతుల ఆమోదం, మార్గదర్శనం లేకపోవడం.
* డీపీఆర్‌లో పేర్కొన్న ఆకృతుల్లో మార్పులు.
నిధులు కేటాయించినా ఖర్చు అంతంతే.. రాష్ట్ర జలవనరులశాఖ ఈ ప్రాజెక్టుపై నిధులను చాలినంతగా ఖర్చు చేయట్లేదు. బడ్జెట్ కేటాయింపుల్లో 30 శాతమే ఖర్చు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిర్దేశించుకున్నంత మేర ఖర్చు చేసేందుకు, పనులు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి నిధులను కేంద్రమే భరిస్తామంది. రాష్ట్రం ఖర్చు చేసిన నిధులు కేంద్రం తిరిగి చెల్లించాలి. రాష్ట్రం చేసిన ఖర్చులపై ప్రతి ఏడాది ఆడిటింగ్ పూర్తిచేసి కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలి.
ప్రధాన డ్యాం నిర్మాణంలో సాంకేతిక సమస్యలను సరైన వ్యూహంతో అధిగమించొచ్చు. వాస్తవమైన గడువులు నిర్దేశించుకోవడం, ఆమోదం పొందిన ఆకృతులకు లోబడి ఉండటం, ప్రభావవంతమైన సమన్వయంతోనే ఈ సమస్యలను అధిగమించవచ్చు.
పోలవరం పునరావాస కార్యక్రమాలు బాగా ఆలస్యమవుతున్నాయి. నిర్వాసితులకు పరిహారం సకాలంలో అందించేందుకు అవసరమైన డాక్యుమెంటేషన్, ఇతర పనులు ఆలస్యమవుతున్నాయి. పోలవరం పునరావాసానికి కావాల్సినంత మంది అంకితభావంతో పని చేసే అధికారులు, ఉద్యోగులూ అవసరం.