CBN FIRE ON JAGAN: మద్యనిషేధం, సీపీఎస్, అమరావతిపై మాట తప్పి మడమతిప్పడం జగన్‌రెడ్డి విశ్వసనీయతా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిలదీశారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలతో ఆయన ఆన్‌లైన్ ద్వారా వ్యూహకమిటీ సమావేశం నిర్వహించారు. వైకాపా ప్లీనరీలో జగన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. చిన్నాన్నపై గొడ్డలివేటు వేసిన నేరస్థుల్ని కాపాడటం విశ్వసనీయతా అని మండిపడ్డారు. అమ్మని గెంటేసిన వాడు.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, స్కూల్ పిల్లలకు ఏం చేస్తారని దుయ్యబట్టారు. జగన్ ఓటమి భయంతోనే.. తెదేపా అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిపివేస్తుందని అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి కన్నా తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమానికి ఎక్కువ ఖర్చు చేసిందని పేర్కొన్నారు.
పయ్యావుల కేశవ్‌కు భద్రత పెంచాలి: పాఠశాలల విలీనాన్ని ఉపసంహరించుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 51 వేల ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమర్నాథ్ యాత్రలో రాష్ట్ర ప్రజలు గల్లంతైతే జగన్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడాన్ని ఖండించారు. పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్‌కు భద్రత పెంచాలని డిమాండ్ చేశారు.
ఆ సంక్షేమ కార్యక్రమాల్ని రద్దు: అన్న క్యాంటీన్లు, చంద్రన్న బీమా, విదేశీ విద్య, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, పెళ్లి కానుకలు, పండుగ కానుకల లాంటి 100 సంక్షేమ కార్యక్రమాల్ని జగన్ రెడ్డి రద్దు చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.35వేల కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. ప్రభుత్వ నిధులు దోపిడీ చేస్తూ జగన్ రెడ్డి సంక్షేమానికి కోతలు కోస్తున్నారన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే.. ఇంతకంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. కేంద్రం ఇస్తున్న రేషన్ బియ్యం 3 నెలల నుంచి నిలిపివేసిన జగన్ రెడ్డి.. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ నిధులను తన ఖాతాలో వేసుకోవడం సంక్షేమమా అని మండిపడ్డారు. వైకాపా ప్లీనరీకి ఆర్టీసీ బస్సులు, స్కూలు బస్సులు, పారిశుద్ధ్య సిబ్బందిని ఇష్టారాజ్యంగా వినియోగించారని చంద్రబాబు మండిపడ్డారు.
వాటి నిర్మాణంలో అలసత్వం: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ యూనివర్సిటీల నిర్మాణం విషయంలో జగన్ రెడ్డి అలసత్వం వహిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. విశాఖ ఉక్కు అమ్మకానికి వైకాపా ప్రభుత్వం సహకరిస్తోందని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు కార్యక్రమాలను కొనసాగించాలని సమావేశంలో నేతలు నిర్ణయించారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.