పల్లె ప్రగతి - పంచ సూత్రాల పేరిట ఏపీ పంచాయతీ ఎన్నికలకు తెదేపా మేనిఫెస్టోను చంద్రబాబు విడుదల చేశారు. ప్రజలకు సుపరిపాలన అందించే లక్ష్యంతోనే మేనిఫెస్టోను రూపొందించినట్టు చెప్పారు. గ్రామాల్లో సమర్థవంతమైన పాలన కోసమే ఈ ప్రయత్నమని చెప్పారు.
'గెలిపిస్తే.. ఇవన్నీ చేస్తాం'
ఉచిత కుళాయిలతో రక్షిత మంచినీరు, భద్రత - ప్రశాంతతకు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆలయాలపై దాడులు అరికడతామని... ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తామని చెప్పారు. స్వచ్ఛత, పరిశుభ్రతతో ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దుతామనీ.. వ్యవసాయ మోటర్లకు మీటర్లను అడ్డుకుంటామని చంద్రబాబు వెల్లడించారు. ఆస్తి పన్ను తగ్గించి పౌర సేవలు అందిస్తామన్నారు.
'అవి బలవంతపు ఏకగ్రీవాలు'
వైకాపా చెబుతున్న ఏకగ్రీవాలు ప్రజల ఆమోదంతో జరిగేవి కాదనీ... దౌర్జన్యాలు, దాడులతో భయపెట్టి చేసే బలవంతపు ఏకగ్రీవాలని ఆరోపించారు. ఇందుకు ఇటీవల జరిగిన విధ్వంసాలే ఉదాహరణ అని ధ్వజమెత్తారు. వైకాపా దౌర్జన్యంతో 2,274 ఏకగ్రీవాలు చేసిందనీ.... ప్రజల ఆమోదంలేని ఏకగ్రీవాలను ఉపేక్షించేది లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఏం అభివృద్ధి చేశారని ఏకగ్రీవాలు చేయాలని నిలదీశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో 25 వేల కిలోమీటర్ల రోడ్లు వేస్తే... వైకాపా ప్రభుత్వం ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేసిందో చెప్పాలని ప్రశ్నించారు.
ఇదీ చదవండి : ఆహారం తిరస్కరించిన దంపతులు.. చిత్రవిచిత్ర ప్రవర్తన..!