ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో.. అధికార పార్టీపై అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి తెదేపా కసరత్తు చేస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు... ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆన్ లైన్ ద్వారా ఈ విషయమై శాసనసభాపక్ష సమావేశం చేపట్టారు. వరుస విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకోవటం, రాజధాని తరలింపు, ఇసుక లభ్యత, పన్నుల భారం తదితర అంశాలపై చర్చించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల బిగింపు, పట్టణ, స్థానిక సంస్థల్లో పన్నుల మోత వంటి 20 అంశాలను సభలో ప్రధానంగా లెవనెత్తాలని నిర్ణయించారు.
కనీసం 10 రోజులు నిర్వహించాలి: చంద్రబాబు
అసెంబ్లీ సమావేశాలను కనీసం 10 రోజుల పాటు నిర్వహించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఉన్న సమస్యలు పరిష్కరించటం చేతకాక ప్రభుత్వం అనేక కొత్త సమస్యలు సృష్టించిందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటి మీడియాను అసెంబ్లీ సమావేశాలు కవర్ చేయకుండా నియంత్రించటం కిరాతక చర్య అని మండిపడ్డారు. సీఎం సొంత మీడియానే సమావేశాలకు అనుమతించి, ఇతర మీడియా సంస్థలను అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మందబలం ఉందని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం సరికాదని హెచ్చరించారు.
నిర్మాణాత్మక చర్చ జరగాలి: అచ్చెన్నాయుడు
శాసనసభలో ప్రజల సమస్యలపై నిర్మాణాత్మక చర్చ జరగాలని పార్టీ శాసన సభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నామ మాత్రంగా సభను నిర్వహిస్తే ఒప్పుకొనేది లేదని తేల్చిచెప్పారు. తుపానుల సమయంలో ప్రభుత్వం ప్రజలకు ఒక్క పైసా కూడా చెల్లించిన దాఖలాల్లేవని అన్నారు.