CBN Fires On YSRCP Govt: ప్రజలు అధికార పీఠమెక్కిస్తే.. వైకాపా ప్రభుత్వం మాత్రం వారిపై దాడులు చేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రెండో రోజు పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పం మండలం దాసేగానూరు సభలో ఆయమ మాట్లాడారు. ప్రజాసమస్యలపై పోరాడేవారిని ప్రభుత్వం వేధిస్తోందన్న బాబు.. బాధితుల్లో వైకాపా నేతలూ ఉన్నారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఎన్నికలు ప్రహసనంలా మారాయని మండిపడ్డారు. మద్యం తయారీలోనూ రసాయనాలు కలుపుతున్నారని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం పాడవుతుంటే.. మరో వైపు దోపిడీకి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ కుప్పం నుంచే పోటీ చేసి.. మళ్లీ సీఎం అవుతానని ధీమా వ్యక్తం చేశారు. తెదేపా అధికారంలోకి రావటం.. తాను సీఎం కావటం ఖాయమని స్పష్టం చేశారు.
వాళ్లనే మార్చేద్దాం
'ప్రజా సమస్యలపై పోరాడేవారిని వేధిస్తున్నారు. ఎన్నికల కోసం కుప్పం రాకున్నా ఏడుసార్లు గెలిపించారు. పొత్తుల్లేకుండా ఎన్నోసార్లు గెలిచాం. వైకాపా నాయకులకు రాజకీయాలు తప్ప మరో ధ్యాస లేదు.' వైకాపా అధికారంలోకి వచ్చాక ఎన్నికలు ప్రహసనంలా మారాయి. మద్యం తయారీలో రసాయనాలు కలుపుతున్నారు. ప్రజల ఆరోగ్యం పాడవుతుంటే.. మరో వైపు దోపిడీ. తెదేపా అధికారంలోకి రావడం, నేను సీఎం అవ్వడం ఖాయం. కుప్పం నుంచే పోటీ చేస్తా... మళ్లీ సీఎం అవుతా. స్థానిక నేతలు మారకపోతే వాళ్లనే మార్చేద్దాం. - చంద్రబాబు, తెదేపా అధినేత
పొత్తులు అవసరం లేదు
తనకు కుప్పం నియోజకవర్గంతో విడదీయరాని బంధం ఉందని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. వైకాపా నేతల పొత్తుల వ్యాఖ్యలపైనా స్పందించిన ఆయన... పొత్తులు పెట్టుకుంటేనే తెదేపా గెలుస్తుందన్న వ్యాఖ్యలను ఖండించారు. పొత్తుల్లేకుండా ఎన్నోసార్లు గెలిచామని చెప్పారు. అంతకు ముందు కుప్పం ఆస్పత్రిలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను చంద్రబాబు ప్రారంభించారు.
ఇదీ చదవండి: MLC Jeevan reddy about Raghava : 'రాఘవ దురాగతాలపై సిట్ ఏర్పాటు చేయాలి..'