రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీల్లో ఫీజు రీయంబర్స్మెంట్, రిజర్వేషన్లు వర్తించవని ప్రభుత్వం చెప్పడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేయడమే అవుతుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును ఉభయ సభలు ఆమోదించడం బాధాకరమన్నారు.
ప్రభుత్వం తిరోగమన విధానంలో ప్రయాణిస్తుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే కేంద్రం... ప్రభుత్వ సంస్థలను ధ్వంసం చేసి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లోనూ రిజర్వేషన్లు, ఫీజ్ రీయంబర్స్మెంట్ కల్పించి.. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని చాడా డిమాండ్ చేశారు.