జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రులు పాల్గొననున్నారని రాష్ట్ర భాజపా నేతలు ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల భాజపా ప్రణాళికను రేపు మధ్యాహ్నం 12 గంటలకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ విడుదల చేస్తారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ వెల్లడించారు. కేంద్రమంత్రుల ప్రచార షెడ్యూల్‌ను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కె లక్ష్మణ్, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. ఇవాళ సాత్వి నిరంజన్ జ్యోతితో సమావేశాలుంటాయని లక్ష్మణ్ తెలిపారు.
ఈ నెల 27న హైదరాబాద్, చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌తో రోడ్డు షోలు, బహిరంగ సభలు ఉంటాయన్నారు. ఈ నెల 28న జేపీ నడ్డాతో మేధావుల సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 28న మేడ్చల్ మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో రోడ్డుషోలో పాల్గొంటారని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ నెల 29న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అమిత్ షా రోడ్డు షోలో పాల్గొంటారని తెలిపారు.
భాజపా ఎదుగుదలను కట్టడి చేసేందుకు తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. భాజపా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందన్నారు. నగర నలుమూలల్లో యువత, మహిళలు భాజపాకు సంఘీభావం తెలుపుతున్నారని కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కుటుంబ ప్రమేయంలేని పరిపాలనను భాజపా అందిస్తుందన్నారు. వరదరాని హైదరాబాద్‌ను నిర్మాణం చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్