ఆదాయపు పన్ను, జీఎస్టీ చెల్లింపుదారులతో అధికారులు తరచూ సంప్రదింపులు జరపాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్(Nirmala Sitharaman News) ఆధికారులను ఆదేశించారు. దేశంలోని మెట్రో నగరాల్లో పర్యటిస్తూ ఇన్‌కమ్ ట్యాక్స్, జీఎస్టీ, కస్టమ్స్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇవాళ హైదరాబాద్‌కు వచ్చారు.
హోటల్ తాజ్ కృష్ణాలో జరిగిన సమీక్ష సమావేశంలో కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్, సీబీడీటీ ఛైర్మన్ జేబి మహాపాత్రతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆదాయపు పన్ను శాఖ ఉన్నతాధికారులు, కస్టమ్స్, జీఎస్టీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దాదాపు నాలుగు గంటలపాటు శాఖాపరమైన అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
కార్యాలయాల చుట్టూ తిరగకుండా..
చెల్లింపుదారులతో ఎల్లప్పుడు స్నేహపూర్వకంగా ఉంటూ... వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సీతారామన్ సూచించారు. ఉన్నతాధికారులు ప్రధాన కేంద్రాలకే పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయి పర్యటనలు చేసి శాఖ పనితీరును మెరుగుపరిచేట్లు చూడాలని మంత్రి స్పష్టం చేశారు.
ఇన్‌కమ్ ట్యాక్స్, జీఎస్టీ చెల్లింపుదారులకు ఇబ్బందులు ఏవైనా కలిగితే.. కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా తక్షణమే పరిష్కరించేందుకు ఏవైనా ఆలోచనలు ఉంటే తెలియజేయాలని అధికారులకు మంత్రి సూచించారు. పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారులు అందుబాటులో ఉండేట్లు, కింది స్థాయి అధికారులతో తరచూ సమావేశమవుతూ క్షేత్ర స్థాయి పరిస్థితులను, శాఖ పనితీరు మెరుగు పరుచుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: