రాష్ట్ర ప్రజలు తండ్రీకొడుకుల మాయ మాటలు నమ్మొద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ డివిజన్ భాజపా అభ్యర్థి సుప్రియ నవీన్ గౌడ్‌కు మద్దతుగా... ముషీరాబాద్, రాంనగర్ బొమ్మల గుడి, రామాలయం ఏరియా, వైఎస్సార్ పార్క్ రోడ్డు, పార్సీగుట్ట ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. పార్సీగుట్టలో జరిగిన సభలో... తెరాస, కాంగ్రెస్ నాయకులను కండువా కప్పి భాజపాలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరముందన్నారు.
కేసీఆర్ కుటుంబ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత గ్రేటర్ ప్రజలపై ఉందని కిషన్ రెడ్డి అన్నారు. పేదలకు పక్కా ఇళ్ల ఎజెండాతో గత ఎన్నికల్లో గెలిచి... ఇప్పటి వరకు ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే తెరాస పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో నెలకొన్న జఠిలమైన సమస్యలు ప్రభుత్వంపై ఒత్తడి తెచ్చి పరిష్కరించినట్టు భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్ వెల్లడించారు. కేంద్రంలో సుపరిపాలన అందిస్తున్న భాజపాకు ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలుకుతున్నారని తెలిపారు.
ఇదీ చూడండి: 'లా అండ్ ఆర్డర్ సమస్యలుంటే చర్యలేందుకు తీసుకోవట్లేదు?'