పోలవరం ప్రాజెక్టు కింద 1,06,006 నిర్వాసితుల కుటుంబాలు ఉండగా.. ఇప్పటిదాకా కేవలం 4,283 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించినట్టు ఏపీ ప్రభుత్వం తమకు సమాచారమిచ్చిందని కేంద్ర జల్‌శక్తి శాఖ లోక్‌సభకు తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణం, ఆర్&ఆర్ ప్యాకేజ్‌పై తెదేపా ఎంపీ రామ్మోహన్నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
ప్రాజెక్టు సాగునీటి విభాగ నిర్మాణం, భూ సేకరణ, సహాయ, పునరావాసాలకు చేసే ఖర్చును 2014 ఏప్రిల్ 1 నుంచి తిరిగి చెల్లిస్తున్నట్లు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లులను పీపీఏ, సీడబ్యూసీ తనిఖీ చేసిన తర్వాత కేంద్ర ఆర్థికశాఖ అనుమతితో ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నట్లు తెలిపారు. భూసేకరణ, పునరావాసంతో కలిపి కేంద్రం ఇప్పటివరకూ రూ.11,181 కోట్లు చెల్లించిందన్నారు. రూ.418 కోట్లకు పైగా రీయింబర్స్‌మెంట్‌కు జల్‌శక్తి శాఖ జులై 9న అనుమతి మంజూరు చేసిందని స్పష్టం చేశారు.
ప్రస్తుతానికి భూసేకరణ కింద రూ.19.29 కోట్లు, సహాయ, పునరావాసం కింద రూ.236.75 కోట్ల బిల్లులను ఏపీ ప్రభుత్వం పీపీఏకి సమర్పించినట్లు తెలిపారు. ఈ ఏడాది జూన్ ఆఖరికి ఉన్న పోలవరం నిర్మాణ స్వరూపాన్ని కేంద్ర మంత్రి తన సమాధానంలో వివరించారు.
ఇవీచూడండి: Theenmar Mallanna: 'ఎన్ని కేసులు పెట్టినా... పోరాటం ఆగదు'