రాయలసీమ ఎత్తిపోతలకు ముందస్తు పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీకి అఫిడవిట్ సమర్పించింది. రాయలసీమ ప్రాజెక్టు కొత్తది కాదని, అదనపు నీటి వినియోగం లేదని కేంద్రం తెలిపింది. గతంలోని ప్రాజెక్టులకు ఫీడర్గా మాత్రమే ఎత్తిపోతల పనిచేస్తుందని ఎన్జీటీకి కేంద్రం వివరణ ఇచ్చింది. కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశం లేనందున కొత్త ప్రాజెక్టుగా పరిగణించలేమని తేల్చి చెప్పింది.
రాయలసీమ పరిధిలోని ప్రాజెక్టులకు వేర్వేరుగా గతంలోనే అనుమతులు తీసుకున్నారని కేంద్రం వివరణ ఇచ్చింది. తెలుగుగంగ, గాలేరు-నగరికి పర్యావరణ అనుమతులు ఉన్నాయని తెలిపింది. శ్రీశైలం కుడికాలువ పనులకు అనుమతులున్నట్లు పర్యావరణ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించటం లేదని అఫిడవిట్‌లో పేర్కొంది. నీటి మీటర్ల ఏర్పాటుకు కృష్ణా జలవివాదాల ట్రైబ్యునల్ ఆదేశించిందని వివరించింది. దీనిని బోర్డు పర్యవేక్షిస్తోందని వివరణ ఇచ్చింది.
ఇవీ చూడండి: రాయలసీమ ప్రాజెక్టుపై ఏపీ తప్పుదోవ పట్టిస్తోంది: తెలంగాణ