No funds to Polavaram in Budget : దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుల్లో కేంద్రం పాత వైఖరినే అనుసరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలపై ఈసారి బడ్జెట్‌లోనూ నీళ్లు చల్లింది. నాబార్డు రుణం ద్వారా అందించే నిధులపై ప్రతిపాదనల రూపంలో లేదా కేటాయింపుల రూపంలో పోలవరానికి పైసా కేటాయించలేదు. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బుందేల్‌ఖండ్ కరవు ప్రాంతానికి నీరందించే లక్ష్యంతో చేపట్టిన కెన్-బెత్వా (రెండూ యమునా ఉపనదులు) అనుసంధానం ప్రాజెక్టుకు రూ.44,605 కోట్లు ప్రతిపాదించింది.
ఇప్పటికే రూ.6,700 కోట్లు కేటాయించింది. తాగు, సాగు, విద్యుత్తు అవసరాలు తీర్చడంతో పాటు వరద నివారణ, జీవ వైవిధ్య రక్షణకు ఈ ప్రాజెక్టు అవసరమని కేంద్రం చెబుతోంది. ఇవే లక్ష్యాలతో కూడిన పోలవరంపై చిన్నచూపు చూస్తోంది. రూ.55,656 కోట్లకు సవరించిన అంచనాలు ఆమోదించేందుకు ఏళ్ల తరబడి ఉత్తర ప్రత్యుత్తరాలతో సాగదీస్తోంది. 2010-11 నాటి ధరలతో ఆమోదించిన రూ.16010.45 కోట్ల అంచనాలనే పరిగణనలోకి తీసుకుంటున్న కేంద్రం.. ఆ నిధులూ ఇచ్చేందుకు అనేక కొర్రీలు వేస్తోంది.
ఇలాగైతే ఎన్నేళ్లు పడుతుందో?
Union Budget 2022 : 2021-22 కేంద్ర బడ్జెట్‌లోనూ పోలవరానికి నిధులు కేటాయించలేదు. ఈబీఆర్ (బడ్జెటేతర రుణం) రూపంలో రూ.1,070 కోట్లు రీయింబర్స్ చేసింది. ఇందులో నాబార్డు రుణం రూ.751.80 కోట్లు కాగా, కేంద్ర బడ్జెట్ ద్వారా రూ.320 కోట్లు మంజూరు చేసింది. ప్రాజెక్టు పూర్తవ్వడానికి ఇంకా రూ.30 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా. ఈ లెక్కన కేంద్రం రీయింబర్స్ చేస్తూ పోతే మొత్తం నిధులు ఇచ్చేందుకు ఎన్నేళ్లు పడుతుంది? ఈలోగా నిర్మాణ వ్యయం ఎలా పెరుగుతుంది? అంచనాలు మారితే మళ్లీ అనుమతులు సాధ్యమేనా? అన్నవి ప్రశ్నలు.
పోలవరం సాకారమైతే..
పోలవరం ప్రాజెక్టు వల్ల మొత్తం 30.7 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. ఇందులో 7.2 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు కాగా, 23.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు.
- 540 గ్రామాల్లోని 28.5 లక్షల జనాభాకు తాగునీరు అందుతుంది.
- 960 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సాధ్యమవుతుంది.
- ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు 1.5 టీఎంసీల నీటిని సరఫరా చేయొచ్చు.
- గోదావరి నుంచి 80టీఎంసీల నీటిని కృష్ణాకు మళ్లించవచ్చు. దీంతో ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలకు అదనపు నీరందుతుంది.
- కేంద్రం చెబుతున్న నదుల అనుసంధానం విధానానికి ఇది ఆలంబన కానుంది.
కెన్-బెత్వా అనుసంధానం వల్ల..
- ప్రాజెక్టు వల్ల 24.20 లక్షల ఎకరాలకు ప్రయోజనం కలుగుతుంది
- 62 లక్షల జనాభాకు తాగునీరందుతుంది.
- 103 మెగావాట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి, 27 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తికి అవకాశం.
ఇదీ చదవండి: Cm Kcr on Budget: బడ్జెట్ అంతా గోల్‌మాల్ గోవిందం: సీఎం కేసీఆర్
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!