2015 నుంచి సీఐఎస్‌ఎఫ్ బలగాల నియామకంపై చర్చ జరుగుతోంది. ఆ సమయంలో రూ. 150కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. సిబ్బంది జీతభత్యాలు భరించడం ఒక ఎత్తైతే ఇంతమందికి అవసరమైన భవనాలు, నివాసం మొదలైనవి మరో ప్రధాన సమస్య. వీటన్నింటి వ్యయాన్ని కేంద్రమే భరించాలని గతంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారులు లేఖలు రాశారు. పునర్విభజన చట్టం, తాజా గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కేంద్ర బలగాల ఖర్చును రెండు రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. ప్రధాన నదిపై ఉన్న ప్రాజెక్టులే కాకుండా ఎక్కువ ప్రాజెక్టులను, కాలువలను బోర్డుల పరిధిలోకి తెచ్చినందున కేంద్ర బలగాల నిర్వహణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది.
జలసంఘంలోనూ అసంతృప్తి
కృష్ణా, గోదావరి బోర్డుల్లో ఏపీ, తెలంగాణకు చెందినవారెవరినీ ఛైర్మన్‌గా, సభ్యకార్యదర్శిగా, సభ్యులుగా, చీఫ్ ఇంజినీర్లుగా నియమించడానికి వీల్లేదనే నిబంధన పట్ల కేంద్ర జలసంఘం ఇంజినీర్లలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు దేశంలోని ఏ బోర్డులోనూ, ఏ అథారిటీలోనూ ఇలాంటి నిబంధన లేదు. కేంద్ర జలసంఘంలోకి ఆలిండియా ఇంజినీరింగ్ సర్వీసు నుంచి ఎంపికవుతారు. ఇవన్నీ కేడర్ పోస్టులు. వీరికి ఏ రాష్ట్ర సర్వీసుతోనూ సంబంధం ఉండదు. కృష్ణాబోర్డుకు గత మే ఆఖరు వరకు ఉన్న ఛైర్మన్‌పై ఏపీ చాలాసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. చివరకు ఆయన పదవీ విరమణ చేసే ముందు బోర్డు సమావేశం కూడా జరగలేదు.
అలాగే కేంద్ర జలసంఘంలోని మరో ఇంజినీర్‌పైనా పరోక్షంగా ఫిర్యాదు చేశారు. ఇలాంటి సందర్భాల్లో ఫిర్యాదులో వాస్తవం ఉందో లేదో పరిశీలించాలే తప్ప తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ అధికారినీ అసలు బోర్డుల్లోనే నియమించరాదనే నిబంధన పెట్టడం సరికాదనే అభిప్రాయాన్ని పలువురు ఇంజినీర్లు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. కేంద్ర జలసంఘం ఛైర్మన్ లేదా సభ్యులు కూడా ఏదో ఒక రాష్ట్రానికి చెందిన వారై ఉంటారు. ఆ రాష్ట్రంతో ఇంకో రాష్ట్రానికి జల వివాదం ఉండొచ్చు. అంతమాత్రాన వారు ఛైర్మన్‌గా నియమితులు కావడానికి అనర్హులు కాదు కదా అని జలసంఘంలోని ఓ సీనియర్ ఇంజినీర్ ప్రశ్నించారు.
ఇదీ చూడండి: ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50 శాతం కేటాయించాలి: కృష్ణాబోర్డుకు లేఖ